రైతుల ఆకాంక్షలను నూతన ప్రభుత్వాలు నెరవేర్చాలి : వి శ్రీనివాసరావు

Jun 19,2024 23:54 #cpm, #V.Srinivas rao

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్రంలో నూతనంగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం దేశంలో రైతాంగం ఆత్మహత్యలు చేసుకోకుండా నివారణ చర్యలు చేపట్టాలని, పంటలకు మద్దతు ధరల చట్టం చేయాలని, ఎపి రైతు సంఘం పూర్వ కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. వడ్డేశ్వరం కెబి భవన్‌లో గత రెండు రోజులుగా జరుగుతున్న ఎపి రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. రైతు రుణాలను ఒకసారి రద్దు చేసి రైతులకు రుణభారం నుంచి విముక్తి చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి నష్టదాయకమైన మూడు వ్యవసాయ చట్టాలు చేసి రైతాంగ ఉద్యమంపై భయంకరమైన నిర్బంధాన్ని ప్రయోగించిన ఎన్‌డిఎ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రాబోయే కాలంలో రైతాంగం పెద్దయెత్తున ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కూడా టిడిపి ప్రభుత్వంలో బిజెపి భాగస్వామిగా ఉందని, ఆ పార్టీల కార్పొరేట్‌ అనుకూల విధానాల పట్ల రైతాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యవసాయ రంగంలో భాగమైన సహకార రంగాన్ని కేంద్రం తన గుప్పెట్లోకి తీసుకుంటోందన్నారు. సహకార సంస్థల్లో పెద్దయెత్తున ఉన్న డిపాజిట్లను వ్యాపార సంస్థలకు భాగస్వామ్యం కల్పించే ప్రయత్నాలు రైతులు అడ్డుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులను క్రమంగా తగ్గించి ఆ స్థానంలో కార్పొరేట్‌ పెట్టుబడులకు అవకాశాలు పెంచుతున్న విధానాల వల్ల ఇప్పటికే ఎరువులు, పురుగు మందుల విత్తనాలు, రవాణా, పనిముట్ల ధరలు పెంచుతున్నారని విఎస్‌ఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేయాలన్నారు. ఖరీఫ్‌ పనులు ప్రారంభమవుతున్నందున వెంటనే రైతులకు పెట్టుబడిసాయం చెల్లించాలన్నారు. ధాన్యం బకాయిలు రూ.1,600 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. రబీ పంట నష్టపరిహారం, కరువు మండలాల్లో రైతాంగానికి ఇన్‌పుట్‌ సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం అధ్యక్షులు వి కృష్ణయ్య, రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్‌రెడ్డి, కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ, వై కేశవరావు పాల్గొన్నారు.

➡️