వైసిపికి అభ్యర్థులు కరువు

Jan 27,2024 22:17 #Chandrababu Naidu, #speech

-ప్రభుత్వ బాధితులందరూ నా స్టార్‌ క్యాంపెయినర్లే!

-‘రా… కదలిరా’ సభల్లో టిడిపి అధినేత చంద్రబాబు

ప్రజాశక్తి- కడప, అనంతపురం ప్రతినిధులు: ‘వైసిపి తరుఫున పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం లేదు. దొరికిన అభ్యర్థులూ పారిపోతున్నారు. అవును… నాకు స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రభుత్వ బాధితులందరూ నా స్టార్‌ క్యాంపెయినర్లే’ అని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రా… కదలిరా కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన అన్నమయ్య జిల్లా పీలేరులోనూ, అనంతపురం జిల్లా ఉరవకొండలోనూ జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు. ఇతర పార్టీల్లోనూ చంద్రబాబుకు స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇదే ఉరవకొండలో జరిగిన బహిరంగ సభలో ఈ నెల 24న వ్యాఖ్యానించారు. దీనిపై చంద్రబాబు… ఉరవకొండలో జరిగిన బహిరంగ సభలో స్పందించారు. ప్రభుత్వ చర్యలను ఎవరు వ్యతిరేకించినా వారందరికీ టిడిపి స్టార్‌ క్యాంపెయినర్లు అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముద్ర వేస్తున్నారని ఎద్దేవా చేశారు. సంతోషంగా పదవి నుంచి దిగిపోతానని జగన్‌ ఇటీవల చెబుతున్నాడని గుర్తు చేశారు. ఆయన దిగిపోవడం కాదు… ప్రజలే దించేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో 69 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు గెలవలేరనే ఉద్దేశంతో అభ్యర్థులను వైసిపి మార్చిందని, 29 మందికి టికెట్లు ఎగ్గొట్టిందని అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలూ విధ్వంసమయ్యాయని విమర్శించారు. పాలన మొత్తం అస్తవ్యస్తంగా మారిందన్నారు. యువతకు ఉపాధి అవకాశాల్లేకుండా పోయాయని తెలిపారు. ఏటా జాబ్‌ కేలండర్‌ అని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే ఏటా నాలుగు లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగమొచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. భూసంరక్షణ చట్టం పేరుతో తీసుకొచ్చిన నల్లచట్టం ఆచరణలో భూభక్షణ చట్టంగా మారిందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. సాగునీటికి ప్రాధాన్యత కల్పించి ప్రతి ఎకరానికీ నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. వైసిపి అధికారంలోకి వచ్చాక రద్దు చేసిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ సబ్‌ప్లాన్‌ను అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో తొమ్మిదిసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయని, రూ.56 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేసిందని వివరించారు. ఈ భారాల్లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. 2019లో రాయలసీమ ప్రాజెక్టుల అభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.12,500 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఈ ఐదేళ్ల వైసిపి పాలనలో రూ.200 కోట్లు కూడా ఖర్చు చేయకుండా సీమ ద్రోహిగా జగన్‌ మిగిలిపోయారని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధికి ఎన్‌టిఆర్‌ హయాం నుంచీ పాటు పడుతున్నామని తెలిపారు. గోదావరి నుంచి వృథాగా సముద్రం పాలవుతున్న రెండు వేల టిఎంసిల్లో 120 టిఎంసిలను శ్రీశైలానికి తీసుకొస్తే రాయలసీమను రతనాల సీమగా మార్చొచ్చన్నారు. సోలార్‌ విద్యుత్‌ ద్వారా రైతులకు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామన్నారు. అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకునిపోయిన ఘటనలో 40 మంది చనిపోయారని, మూడేళ్లవుతున్నఫ్పటికీ ఈ డ్యామ్‌ను పునరుద్ధరణ ఏదని ప్రశ్నించారు. ఆవులపల్లి రిజర్వాయర్‌ పనుల పేరుతో రూ.600 కోట్లను మంత్రి పెద్దిరెడ్డి దోచేశాడని ఆరోపించారు. వైసిపి అసమర్థ, ఆరాచక, విధ్వంసక పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. టిడిపి, జనసేన పార్టీ కార్యకర్తలు ఈ సంకల్పబలంతో మరో 74 రోజులపాటు ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. వైసిపిని ఇంటికి పంపించడానికి ప్రభుత్వోద్యోగులు, యువత సిద్ధంగా ఉన్నారన్నారు.

➡️