ఎన్‌డిఎ పాలనలో ఒరిగిందేమీ లేదు

May 9,2024 23:36 #ap cm jagan, #speech

– మరో అంటరానితనంపై యుద్ధం తప్పదు
– రాజంపేటలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు హామీ
– కళ్యాణదుర్గం, కర్నూలు, రాజంపేట సభల్లో సిఎం జగన్‌
ప్రజాశక్తి – యంత్రాంగం :ఎన్‌డిఎ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, పదేళ్ల కింద రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ఇప్పటికైనా ఇస్తారోమోనని ఆశించిన వారికి నిరాశే ఎదురైందని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్‌ఆర్‌సి, సిఎఎ విషయంలో మైనార్టీ మనోభావాలకు అండగా ఉంటామని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బిజెపితో చంద్రబాబు జతకట్టారని, మరో పక్క మైనార్టీలను మోసం చేసేందుకు డ్రామాలు మొదలు పెట్టారని, ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? అని ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనని చెప్పారు. ప్రతి సందర్భంలోనూ మైనార్టీలకు సముచిత స్థానం కల్పించామని, 175 ఎమ్మెల్యే సీట్లల్లో కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఏడు సీట్లు ఇచ్చామని తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, కర్నూలు, అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షాలతో కూడిన ఉమ్మడి సభల్లో చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్‌, చంద్రబాబు వదినమ్మ పురందేశ్వరిపై సానుకూల మాటలను మాట్లాడి, మనమీద రాళ్లు వేస్తున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు వంటి అవినీతిపరుడు ఎక్కడా లేరని ప్రధాని మోడీ విమర్శించారని గుర్తు చేశారు. పేద పిల్లల ఇంగ్లీష్‌ మీడియం చదువులను కూటమి వ్యతిరేకిస్తోందని అని విమర్శించారు. రూపం మార్చుకున్న అంటరానితనం మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రాజంపేటలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు ఏర్పాటు చేస్తానని హామీనిచ్చారు. వచ్చే టర్మ్‌లో అన్నమయ్య రిజర్వా యర్‌ను పునరుద్ధరిస్తామని, 90 శాతం పింఛా ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని తెలిపారు. రైల్వేకోడూరు వరకు జిఎన్‌ఎస్‌ఎస్‌ పనులను పూర్తి చేస్తామని హామీనిచ్చారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపిలను ఎన్నుకునేవి మాత్రమే కాదని, రాబోయే ఐదేళ్లు ఇంటింటా అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించేవని తెలిపారు. తాము చేసిన మార్పులు గతంలో ఎప్పుడైనా చూశారా? అని ప్రజలను అడిగారు. కులం, మతం, పార్టీ చూడకుండా పేదల బతుకులు మార్చడం కోసం ముందడుగు వేశామన్నారు. రాజకీయ స్వార్థం కోసం ప్రజల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గమన్నారు. ఇక్కడ బటన్‌ నొక్కితే ఢిల్లీకి వినిపించాలని చెప్పారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మొద్దని కోరారు. ‘చంద్రబాబు వద్ద డబ్బులు చాలా ఉన్నాయి… ఎన్నికల్లో ఓటుకు రూ. రెండు వేలు పంచేందుకు కూడా సిద్ధపడ్డారు. ఆయన డబ్బులిస్తే తీసుకోండి…ఓటు మాత్రం నాకేయండి’ అని కోరారు. ఆయా చోట్ల ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.

➡️