భయపడే ప్రసక్తే లేదు.. 24నే నామినేషన్‌ వేస్తా

Apr 22,2024 22:10 #2024 election, #dastagiri, #nomination
  •  జైభీమ్‌ భారత్‌ పార్టీ పులివెందుల అభ్యర్థి దస్తగిరి

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ (వైఎస్‌ఆర్‌ జిల్లా) : భయభ్రాంతులకు గురిచేసిన భయపడే ప్రసక్తే లేదని, సిద్ధం సభలకు ప్రజలను భయపెట్టి పిలిపించుకుంటున్నారని జైభీమ్‌ భారత్‌ పార్టీ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి దస్తగిరి అన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా పులివేందుల భాక్రాపురంలోని జై భీమ్‌ భారత్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 25న పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయాలనుకున్నానని తెలిపారు. కానీ అదే రోజు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్‌ వేస్తున్నారని, ఈ దృష్ట్యా ముందే రోజే నామినేషన్‌ వేసుకోవాలని అధికారులు సూచించారని చెప్పారు. 24న జై భీమ్‌ భారత్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేస్తానని, ప్రజలందరూ తరలివచ్చి మద్దతు పలకాలని కోరారు. జగన్‌ నామినేషన్‌ వేసే రోజు ఎవరూ నామినేషన్‌ వేయకూడదనడం దారుణమన్నారు. ప్రతి ఇంటికీ వచ్చి ఓటు అడుగుతానని, ప్రతి ఒక్కరూ సహకరించి గెలిపించాలని కోరారు. జై భీమ్‌ పార్టీ కార్యాలయాన్ని మూసివేయాలని అధికారుల నుంచి ఒత్తిడి వస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ కార్యాలయాన్ని మూసివేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. జగన్‌ ఇంటికి సమీపంలో తమ పార్టీ కార్యాలయం పెడితే వైసిపి నాయకులకు ఎందుకంతలా భయపడుతున్నారో చెప్పాలన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏ లాభమూ జరగలేదని, ఉద్యోగులకు ఎటువంటి బెనిఫిట్లు రాలేదని విమర్శించారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

➡️