భగ్గుమన్న ఉద్యోగులు – నేడు డైరక్టర్‌ కార్యాలయ ముట్టడికి పిలుపు

  • తొలగింపుతో బెదిరింపులు.. సమగ్ర శిక్ష డైరెక్టర్‌ నిర్వాకం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమ్మెలో ఉన్న సమగ్ర శిక్ష, కెజిబివి ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. సమస్యలు పరిష్కరించడానికి బదులుగా ఉద్యోగులను విధుల నుండి తొలగించడం ప్రారంభించింది. విధులకు గైర్హాజరవుతున్నారన్న సాకుతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తోంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న పి జయంతి,కెజిబివిలో పిఇటిగా పనిచేస్తున్న దేవరపు బేబిరాణిలను తొలగిస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సమగ్ర శిక్ష అనకాపల్లి అడిషనల్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఇద్దరని కాదని, సమ్మెలో ఉన్న మిగిలిన వారిని కూడా ఇదే రీతిలో ఉద్యోగాల నుండి తొలగిస్తామని ఉన్నతాధికారులు అంటున్నారు. డైరక్టర్‌ ఆదేశాల మేరకే…ఇప్పటికే షోకాజ్‌ నోటీసు ఇచ్చిన ఉద్యోగులను విధుల నుండి తొలగించాలంటూ సమగ్ర శిక్ష డైరెక్టర్‌ బి శ్రీనివాసరావు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ తొలగింపుల పర్వం ప్రారంభమైనట్లు తెలిసింది. బుధవారం నిర్వహించిన ఆన్‌లైన్‌ సమావేశంలో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. తనపై ఇప్పటికే చాలా కోర్టు ధిక్కరణ కేసులున్నాయని, మరో కేసుకు భయపడేది లేదని ఆయన అన్నట్లు సమాచారం. హైకోర్టులో కేసు అయితే తాను చూసుకుంటానని. నిండమునిగిన వాడికి పెద్ద చలి ఉండదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సమ్మెలో ఉన్నవారికి పెండింగ్‌ వేతనాలు చెల్లించవద్దని, ఎక్కడైన ప్రిన్సిపాళ్లు వారికి అండగా నిలిస్తే వారినికూడా తొలగించాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. కెజిబివి నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని చర్చలకు కూడా పిలవకుండా తొలగించాలని ఆయన చెప్పారు. సమ్మెలో ఉన్న వారిని ఉద్దేశించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

భగ్గుమన్న ఉద్యోగులు

  • నేడు డైరక్టర్‌ కార్యాలయ ముట్టడికి పిలుపు

విధుల నుండి తొలగించడం పట్ల సమగ్ర శిక్ష, కెజిబివి ఉద్యోగులు మండిపడ్డారు. ఇటువంటి చర్యలకు భయపడేది లేదని ప్రకటించారు. డైరక్టర్‌ ఆదేశాలకు నిరసనగా, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సమగ్ర శిక్ష డైరెక్టర్‌ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర శిక్షా కాంట్రాక్టు అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌(జెఎసి) ఆధ్వర్యంలో ఉద్యోగులు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏలూరులో ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించకపోగా సమగ్ర శిక్ష అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ ఉద్యోగులను తొలగిస్తామని బెదిరింపులకు దిగడం సరికాదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబసభ్యులతో కలిసి బుధవారం సమగ్రశిక్ష ఉద్యోగులు నిరసనలు కొనసాగించారు. తక్షణమే చర్యలు: సిపిఎం డిమాండ్‌సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రాజెక్టు డైరెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఉద్యోగుల చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 16 రోజులుగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మె చేస్తున్నారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా వారిని నిందించే విధంగా మాట్లాడడం గర్హనీయమని తెలిపారు. మహిళా ఉద్యోగులను అవమానిస్తూ వ్యాఖ్యానించిన వ్యక్తి ఆ పదవికి అనర్హుడని పేర్కొన్నారు. కాబట్టి తక్షణం డైరెక్టర్‌పై చట్టపరమైన, శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️