సాగర్‌ కాలువలో ముగ్గురు మృతి

Apr 23,2024 00:15 #3 died, #death
  •  ఆలస్యంగా వెలుగులోకి

ప్రజాశక్తి – నాదెండ్ల (పల్నాడు జిల్లా) : ఈతకెళ్లి ముగ్గురు యువకులు మృత్యువాత పడిన సంఘటన పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేట మండలం ములకలూరుకు చెందిన చలమల రాజు (20), గేరా పురుషోత్తం (20), బోరుగడ్డ ఆకాష్‌ (21) కూలి పనులు చేస్తుంటారు. స్నేహితులైన వీరు ముగ్గురూ ఆదివారం నాదెండ్ల మండలంలోని ఎండుగుంపాలెంలో ఓ వేడుకకు ద్విచక్ర వాహనంపై వచ్చారు. సాయంత్రం వేళ ఈతకోసమని కనపర్రు-బుక్కాపురం గ్రామాల మధ్య ఉన్న ఎన్‌ఎస్‌పి కాల్వకు వెళ్లారు. సోమవారం ఉదయం అటుగా పొలాలకు వెళ్తున్న వారికి కాల్వలో ఒక మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. ఆ ప్రదేశంలో ద్విచక్ర వాహనంతోపాటు ముగ్గురి దుస్తులు, చెప్పులు ఉండడంతో గాలింపు చేపట్టగా మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ బలరాంరెడ్డి తెలిపారు.

➡️