నేడు’మున్సిపల్‌’చర్చలు

Jan 2,2024 09:17 #municipal, #today
  • హెల్త్‌ అలవెన్స్‌ జిఓ విడుదల
  • పార్కు వర్కర్లను చేర్చాలన్న సిఐటియు
  • మిగిలిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. నేడు (మంగళవారం) చర్చలు జరగనున్నాయి. ఈ మేరకు డిఎంఎ ఆఫీసునుండి సమాచారం అందినట్లు ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు తెలిపారు. కార్మికసంఘాలతో జాయింట్‌ మీటింగ్‌ నిర్వహించను న్నట్లు ఆ సమాచారంలో పేర్కొన్నారని, ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలం సురేష్‌తోపాటు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌కూడా పాల్గొంటారని తెలిపారని చెప్పారు. ఈ సమావేశంలోనైనా మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల ని కోరారు. అంతకుముందు శానిటేషన్‌ డ్రైవర్లు, యుజిడి వర్కర్లు, మలేరియా కార్మికులకు ఆక్యుపేషన ల్‌ హెల్త్‌ అలవెన్స్‌ చెల్లించేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మున్సిపల్‌ కార్మిక సంఘాలు ఇచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ ఉత్తర్వులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. వెంటనే ఇది అమల్లోకి వస్తుందని, జిఓలో పేర్కొన్న మూడు విభాగాల సిబ్బందికి నెలకు రూ.6000 చొప్పున చెల్లిస్తామని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) పార్కుల్లో పనిచేసే వర్కర్లకు కూడా హెల్త్‌ అలవెన్స్‌ను చెల్లించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘ ప్రధాన కార్యదర్శి కె.ఉమా మహేశ్వరరావు రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రికి లేఖ రాశారు. డిసెంబర్లో సమ్మె ప్రారంభమైన తరువాత 28వ తేదీన సంఘ నాయకులతో చర్చలు జరిపారని, అంతకుముందు 2023 డిసెంబరు 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి చర్చించారని పేర్కొన్నారు. ఈ రెండు సందర్భాల్లో యుజిడి, డ్రైవర్లు, మలేరియా కార్మికులతోపాటు పార్కులో పనిచేసే సిబ్బందికి ఓహెచ్‌ఏ మంజూరు చేస్తామని హామీనిచ్చారని జిఓలో అది లేదని తెలిపారు. 31వ తేదీన పంపించిన మినిట్స్‌లోనూ అంగీకరించినట్లు ప్రస్తావించారని తెలిపారు. అయినా జిఓలో పార్కు వర్కర్లను చేర్చకపోవడం సరికాదని, వెంటనే జిఓను సరిదిద్ది వారిని కూడా చేర్చాలని కోరారు. అదే సమయంలో మున్సిపల్‌ వర్కర్ల మిగిలిన డిమాండ్లను కూడా పరిష్కరించాలని, అంతవరకు సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు.

➡️