యువతను మభ్యపెడుతున్ననేటి పాలకులు

Dec 28,2023 14:38 #SFI
  • సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నరసింగరావు
  • ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభల్లో ప్రజా సంఘాల నేతలు సందేశాలు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభల సందర్భంగా సోదర విద్యార్థి సంఘాలతో పాటు వివిధ ప్రజాసంఘాల నేతలు సందేశాలు ఇచ్చారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నరసింగరావు మాట్లాడుతూ నాటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం నుంచి నేడు మళ్ళీ విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం కార్మికులు తోపాటుగా విద్యార్థులు కూడా పోరాటాలు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న సమస్యలపై కూడా విద్యార్థి సంఘాలు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

నేటి పాలకులు యువతను మభ్యపెట్టి వారి సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్నారు. మాదకద్రవ్యాల వినియోగం బాగా ఇటీవల కాలంలో పెరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో యావత్తు సమాజం మార్పు చెందాలంటే విశాల విద్యార్థి ఉద్యమాల అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో తాను పనిచేసినప్పుడు విద్యార్థి సంఘాల ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ పదేళ్లపాటు వరుసగా విజయాలు సాధించిందన్నారు. ఈ సందర్భంగా నాటి అనుభవాలను ఆయన వివరించారు. స్థానిక సమస్యలపై ప్రతి చిన్న విషయంలోనూ ఎస్‌ఎఫ్‌ఐ స్పందించి పోరాడిందన్నారు.పెట్టుబడిదారీ విధానాల వలన దేశంలోనూ, రాష్ట్రంలోనూ నానాటికి నిరుద్యోగం పెరుగుతుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న తరుణంలో సోషలిస్టు ఆశయాలను ముందుకు తీసుకు వెళుతున్న ఎస్‌ఎఫ్‌ఐ పెట్టుబడిదారీ విధానాలను వ్యతిరేకించడంతోపాటు నిరుద్యోగానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో సిఐటియు కూడా నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తుందన్నారు. అలాగే ఎస్‌ఎఫ్‌ఐ చేసే భవిష్యత్తు పోరాటాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఎస్‌ఎఫ్‌ఐ విస్తరించి ఉందన్నారు.విద్యారంగంలో ఎక్కువగా వెనకబడి ఉండేది వ్యవసాయ కార్మికుల పిల్లలే అన్నారు.విద్యారంగాన్ని పరిరక్షించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం సరైంది కాదన్నారు. విద్యారంగంలో కాషాయికరణను ప్రవేశపెట్టి ప్రజల్ని మూడు వేల సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లాలని బిజెపి ప్రయత్నం చేస్తుందన్నారు. దేశ సంపద అయిన రైల్వే, ఎల్‌ఐసి, విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వ రంగ సంస్థల అమ్మి కార్పోరేట్లకు తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ తరుణంలో రానున్న కాలంలో విద్యా, ఉపాధి కోసం ఎస్‌ఎఫ్‌ఐ పోరాడాలని పిలుపునిచ్చారు.

కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలన వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. అన్ని రంగాలను బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు విద్యారంగాన్ని కాపాడ కోవడానికి భవిష్యత్తు పోరాటాలు మరింత ఉధతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీ ప్రభుత్వం ఎన్‌ఈపిని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల ప్రాథమిక విద్య పూర్తిగా నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నట్లు గొప్పలు చెబుతున్న ప్రభుత్వం బైజ్యుస్‌ తో ఒప్పందాలు పెట్టుకుని ట్యాబులు పంపిణీ చేసి అక్రమాలు, దోపిడీకి పాల్పడుతున్నారు తప్ప ప్రాథమిక విద్య బలపడలేదన్నారు. పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకుండా సీబీఎస్‌ఈ సిలబస్‌, ఇంగ్లీష్‌ మీడియంలను ఎలా బోధిస్తారని ప్రశ్నించారు. నాడు-నేడు, అమ్మఒడి వంటి పథకాలు విద్యార్థులకు అమలు చేస్తున్నా లక్షల మంది విద్యార్థులు ఎందుకు ప్రభుత్వ విద్యకు దూరమవుతున్నారని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో కాషాయికరణకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలన్నీ ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, హక్కులు సాధన కోసం రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు చేయాలని,ఈ మహాసభల్లో సమస్యలను చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని వామపక్ష విద్యార్థి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

➡️