మాచర్ల ఎమ్మెల్యే సోదరుడిపై కేసు

  • మంగళగిరి పోలీస్‌ స్టేషన్లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల పోలింగ్‌ రోజున తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా వెంకట్రామిరెడ్డి దాడి చేశారంటూ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన టిడిపి ఏజెంట్‌ ఆదివారం చేసిన ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మాణిక్యంతో పాటు పలువురు టిడిపి నాయకులు మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. ఈ ఘటన తమ పరిధిలోనిది కాదని, సంబంధిత స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అధికారులు వారికి చెప్పారు. దీంతో వారు డిజిపి కార్యాలయానికి వెళ్లి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరారు. తనను కులం పేరుతో దూషించారని, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని వీడియో కాల్‌ చేసి బెదిరించారని ఫిర్యాదులో మాణిక్యం పేర్కొన్నారు. స్థానిక పోలీసులు తమకు సహకరించలేదని, పోలింగ్‌ కేంద్రంలో బెదిరించారని, ఒక డిఎస్‌పి కూడా వారిని నివారించకుండా తనపై దాడికి ప్రయత్నించారని ఈ ఫిర్యాదులో ఆరోపించారు. ఎన్నికల రోజు ఉన్న అధికారులు సహకరించలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు మంగళగిరి రూరల్‌ పోలీసులు తెలిపారు.

➡️