రాష్ట్ర ఓటర్లు మొత్తం 4.14 కోట్లు

  •  46,389 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు
  •  రూ.203 కోట్లు విలువైన నగదు, వస్తువుల సీజ్‌
  • రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకె మీనా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో  : రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వరకు అంటే ఏప్రిల్‌ 25 వరకు అప్‌డేట్‌ చేసిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా గురువారం సచివాలయంలో వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 4,13,33,702 మంది సాధారణ ఓటర్లు ఉన్నారని, వీరిలో పురుష ఓటర్లు 2,02,74,144 కాగా.. మహిళా ఓటర్లు 2,10,56,137 అని ప్రకటించారు. వీరితోపాటు 68,185 (65,707 పురుష, 2,478 మహిళా) సర్వీసు ఓటర్లు, 3,421 థర్డ్‌జెండర్‌ ఓటర్లు ఉన్నట్లు ఆయన తెలియజేశారు. ఈ ఏడాది జనవరిలో ముద్రించిన ఎలక్టోరోల్‌ స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ 2024 సమయానికి 4,08,07,356 ఓటర్లు ఉన్నారని అప్పటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చే సమయానికి మరో 5,94,631 ఓటర్లు పెరిగారని తెలిపారు. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 46,389 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల కోసం 1.60 లక్షల బ్యాలెట్‌ యూనిట్లు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. 10 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 30కు పైగా అభ్యర్థులు పోటీపడుతుండటంతో బ్యాలెట్‌ యూనిట్ల సంఖ్య అనుకున్నదానికంటే పెరిగిందని చెప్పారు.

➡️