మాగుంట విజయబాబు కన్నుమూత

Apr 22,2024 10:08 #death, #Magunta family, #Son, #tragedy
  • నేడు అంత్యక్రియలు

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపి మాగుంట సుబ్బిరామిరెడ్డి కుమారుడు మాగుంట విజయబాబు (55) మరణించారు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో స్థానిక అపోలో ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొంత కాలంలో షుగర్‌ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. విజయబాబు తండ్రి సుబ్బిరామిరెడ్డి ప్రముఖ కాంగ్రెస్‌పార్టీ నేత, ఎంపిగా పనిచేశారు. నక్సల్‌ కాల్పుల్లో ఆయన మరణించారు. సుబ్బిరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ కావలి ఎమ్మెల్యేగా పనిచేశారు. వారి ఏకైక సంతానం మాగుంట విజయబాబు. విజయబాబు కుమారుడు సుబ్బిరామిరెడ్డి ప్రస్తుతం విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. ఆయన మంగళవారం స్వదేశానికి చేరుకున్న తరువాత నగరంలోని సరస్వతినగర్‌లోని మాగుంట ఇంటి నుంచి పెన్నా తీరం బోడిగాడి తోట వరకు అంతిమ యాత్ర, అక్కడే దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విజయబాబు భౌతికకాయాన్ని నగరంలోని పలువురు సందర్శించి నివాళులర్పించారు.

➡️