మట్టి పెళ్లలు విరిగిపడి కార్మికుడు మృతి

Feb 7,2024 21:30 #died, #guntur, #Laborer, #tragedy

– పైప్‌లైన్‌కు మరమ్మతులు చేస్తుండగా ఘటన

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) :తాగునీటి పైపులైన్‌కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మట్టి పెళ్లలు పడి ఓ కార్మికుడు మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. మున్సిపల్‌ కమిషనర్‌ బి.శేషన్న పట్టణ పర్యటనలో భాగంగా పైప్‌లైన్‌ లీకేజీలు అరికట్టాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో, ఐతానగర్‌ ఎస్‌బిఐ సమీపంలో తాగునీటి పైప్‌లైన్‌కు అధికారులు మరమ్మతులు చేపట్టారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం చినపరిమికి చెందిన అయిమల్ల వెంకటేశ్వరరావు (55), వరికుంట ఏసుదాసు పనులు చేసేందుకు వచ్చారు. పొక్లెయిన్‌ ద్వారా మట్టిని తొలగిస్తుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగి వారి మీద పడ్డాయి. దీంతో వెంకటేశ్వరరావు ఊపిరాడక చనిపోయారు. ఏసుదాసుకు స్వల్ప గాయాలయ్యాయి. వెంకటేశ్వరరావు కుటుంబీకులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేయాలని ఆందోళన నిర్వహించారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ (బిజెఆర్‌) కమిటీ సభ్యులు మద్దతు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కమిషనర్‌ బి.శేషన్న అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మట్టి ఖర్చుల నిమిత్తం రూ.25 వేలు చెల్లించి, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని కమిషనర్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బిజెఆర్‌ కమిటీ తరుఫున బాధిత కుటుంబానికి రూ.25 వేలను కమిటీ అధ్యక్షులు మేకల సురేష్‌ ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో గాయపడిన ఏసుదాసు తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

➡️