విషాదం – కృష్ణా నదిలో నీటమునిగి ముగ్గురు విద్యార్థులు మృతి

Jan 29,2024 11:56 #died, #Krishna River, #students, #Three, #tragedy

విజయవాడ అర్బన్‌ : సరదా కోసం ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. విజయవాడ పటమటకు చెందిన నడుపల్లి నాగసాయి కార్తికేయ (13), కత్తి ప్రశాంత్‌ (13), ఓ కార్పొరేట్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. గగన్‌ ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. ఈ ముగ్గురితోపాటు కానూరు సనత్‌నగర్‌కు చెందిన ఎస్‌కె.షారూక్‌ ఆదివారం యనమలకుదురు ప్రాంతంలో ఓ శుభకార్యానికి వెళ్లారు. అటు నుండి సరదాగా ఈత కోసమని మధ్యాహ్నం 2 గంటల సమయంలో కృష్ణా నదిలోకి వెళ్లారు. షారూక్‌ ఒడ్డునే కూర్చోగా మిగిలిన ముగ్గురు నదిలోకి దిగారు. ఈత కొడుతుండగా, వారు ఒక్కసారిగా గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రెస్క్యూ టీం ద్వారా విద్యార్థుల కోసం నదిలో గాలించారు. సాయంత్రం 7 గంటల తరువాత విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అప్పటికే విద్యార్థులు మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించారు. దీనిపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా నదిలో గల్లంతైన విద్యార్థులు చనిపోయారని తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్లారని, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని విలపించారు. కృష్ణానది ప్రాంతంలో తరచుగా ఇలాంటి సంఘటనలు జరగడం ప్రధానంగా విద్యార్థులు మృతి చెందడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈతకు వెళ్లిన విద్యార్థులు ఇదే విధంగా మృతి చెందారు. విద్యార్థులు ఈతకు వెళ్లకుండా కృష్ణానదిలో ఊబి ఉన్న ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

➡️