ఉపాధ్యాయుల పోరుబాట

Jan 4,2024 10:04 #Protest, #utf
utf protest for salaries

 

బకాయిల కోసం 12 గంటల నిరసన దీక్ష

ప్రజాశక్తి-యంత్రాంగం : ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆర్థిక సంబంధమైన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాలు పోరుబాట పట్టారు. యుటిఎఫ్‌ ఆధ్వర్యాన బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 12 గంటల నిరసన దీక్ష చేపట్టారు. సకాలంలో వేతనాలు చెల్లించాలని, పిఆర్‌సి, డిఎ, పిఎఫ్‌ తదితర ఆర్థిక బకాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిరసన దీక్షను ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రారంభించి మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ఒకటో తేదీనే జీతాలు, మెరుగైన పిఆర్‌సి, సకాలంలో డిఎలు చెల్లిస్తామని ఇచ్చిన హామీలను జగన్‌మోహన్‌రెడ్డి తుంగలో తొక్కారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రరం, అమలాపురం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వేతన జీవులంతా ‘పోరాడుదాం ఆంధ్ర’ అంటూ పోరుబాట పట్టారని తెలిపారు. రాజమహేంద్రవరంలో యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 9, 10 తేదీల్లో విజయవాడలో 36 గంటల నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు. నెల్లూరులో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆర్ధిక బకాయిలు చెల్లించకుండా రాజకీయం చేస్తోందని, రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి రాజకీయంగానే గుణపాఠం చెప్పాలని అన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.నవకోటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నాలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు పాల్గొన్నారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో ఐటిడిఎ కార్యాలయాల వద్ద ఉపాధ్యాయులు ధర్నాలు చేశారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట నిరసన దీక్షలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ పాల్గొని మద్దతు తెలిపారు. కష్ణా జిల్లా మచిలీపట్నంలో యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కెఎ ఉమమహేశ్వరరావు, ఎస్‌పి మనోహర్‌ కుమార్‌ పాల్గొని మాట్లాడారు. తిరుపతిలో దీక్షా శిబిరాన్ని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎస్‌ నాయుడు ప్రారంభించారు. కాంగ్రెస్‌ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ మద్దతు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఉపాధ్యాయలు వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి, చిత్తూరుల్లో ఉపాధ్యాయులు సహఫంక్తి భోజనాలు చేశారు. బాపట్లలో వంటావార్పు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్‌టిఆర్‌, విజయనగరం, ఏలూరు, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో నిరసన దీక్ష చేపట్టారు.

➡️