మోడీని గద్దె దింపితేనే వికసిత్‌ భారత్‌-సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

ఆదివాసీల హక్కుల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి : కుంట కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్మా
మోడీ తొత్తులైన జగన్‌, బాబులను అల్లూరి స్ఫూర్తితో ఓడించండి : సిపిఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
సిపిఎం, ఇండియా వేదిక భారీ బహిరంగ సభతో ఎరుపెక్కిన కూనవరం
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, కూనవరం విలేకరి :నరేంద్ర మోడీని గద్దె దింపితేనే వికసిత్‌ భారత్‌ అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. గడిచిన పది సంవత్సరాల్లో రాజ్యాంగ మూల స్తంభాలపై మోడీ ప్రభుత్వం దాడికి తెగబడిందని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే భారత దేశానికి అమృత కాలం అని వివరించారు. సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్స, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు, అరకు పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ అల్లూరి జిల్లా కూనవరంలో గురువారం భారీ బహిరంగ సభ జరిగింది. పాచిపెంట అప్పలనర్స, లోతా రామారావు… రేఖపల్లి సెంటర్‌ నుంచి భారీ బైక్‌ ర్యాలీతో సభాస్థలికి చేరుకున్నారు. ఆదివాసీలు సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ ప్రదర్శనతో కూనవరం ఎరుపెక్కింది. ప్రదర్శన అనంతరం జరిగిన సభకు సిపిఎం ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బప్పెన కిరణ్‌ అధ్యక్షత వహించారు.
సభలో ఏచూరి మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు కీలకమైన ఎన్నికలు నేడు జరుగుతున్నాయన్నారు. రాజ్యాంగ మూల స్తంభాలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయానికి తూట్లు పొడవడం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను ధ్వంసం చేయడంతోపాటు ఆర్థిక వినాశకర విధానాలను మోడీ సర్కారు అవలంభిస్తోందన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిని సంవత్సరాల తరబడి జైల్లో పెడుతున్నారని, ఇది ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనని తెలిపారు. రాజకీయ ప్రయోజనం కోసం మతాన్ని ప్రేరేపిస్తూ ప్రజల ఐక్యతకు చిచ్చుపెట్టి.. హిందుత్వను రెచ్చగొట్టి ఓట్లను రాబట్టుకొని గద్దెనెక్కాలనే కుట్ర దేశంలో జరుగుతోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు మోడీ ధారాదత్తం చేస్తున్నారని తెలిపారు. మోడీ అనాలోచిత విధానాల ఫలితంగా దేశంలో ఆర్థికలోటు, నిరుద్యోగం పెరిగాయన్నారు. ధరల పెంపుతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైందని, ప్రతి కుటుంబం అప్పులు చేయాల్సి వస్తోందని తెలిపారు. ఆర్థిక అసమానతలు పెరిగాయన్నారు. సామాజిక అన్యాయానికి మోడీ ప్రభుత్వం పాల్పడిందని వివరించారు. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని, రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ బహిరంగంగానే ప్రకటించడం దారుణమన్నారు. దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలపైనా మోడీ పెత్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. మాట వినకపోతే నిధుల కోత విధించడమే కాకుండా శాసనసభ తీర్మానాలకు సైతం తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నేతలపై ఇడి, సిబిఐ వంటి సంస్థలతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. అక్రమార్కులు బిజెపిలో చేరిన అనంతరం కేసులను మాఫీ చేస్తున్నారని వివరించారు. ఇడి, సిబిఐలతో పాటు తాజాగా ఎలక్షన్‌ కమిషన్‌ను కూడా మోడీ సర్కారు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటోందన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో మతాన్ని రెచ్చగొట్టేలా మోడీ వ్యాఖ్యలు చేసినా ఆయనపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదని వివరించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఎలక్షన్‌ కమిషన్‌కు తాము ఫిర్యాదు చేయనున్నట్టు ఏచూరి తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను, ఆదివాసీ చట్టాలను కాపాడుకోవాలంటే మోడీని ఓడించడం అనివార్యం, అవసరమని అన్నారు.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్‌ కుంట ఎమ్మెల్యే లక్మా మాట్లాడుతూ దేశాన్ని పాలించే అర్హత మోడీకి లేదని, ఆదివాసీ చట్టాలకు మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని తెలిపారు. అటువంటి మోడీ ప్రభుత్వానికి తొత్తు, పొత్తుగా ఉన్న చంద్రబాబు, జగన్‌లను ఓడించాలని పిలుపునిచ్చారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ విలీన మండలాల్లో ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించిన చరిత్ర కమ్యూనిస్టుల సొంతమన్నారు. ప్రజల కోసం భీష్మారావు, చందర్రావులాంటివారు ప్రాణాలకు సైతం తెగించి పోరాడారని గుర్తు చేశారు. సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎర్రజెండా నీడలో టిడిపి, వైసిపి, బిజెపిలను తరిమికొట్టాలని ఆదివాసీలకు పిలుపునిచ్చారు. మోడీ రెండు రోజుల పర్యటనలో ప్రజా సమస్యలపైనా, రాష్ట్రానికి కేటాయింపులపైనా ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. అమరావతిలో రాజధాని గురించిగానీ, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ గురించిగానీ కనీసం నోరు మెదపలేదని తెలిపారు. బాబు, జగన్‌లు పోలవరం నిర్వాసితుల గురించి కనీసం స్పందించిన దాఖలాలు లేవన్నారు. సభలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.సుదర్శన్‌, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, ఎఐఎడబ్ల్యుయు జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, సిపిఎం ఎపి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, మంతెన సీతారాం, వి.వెంకటేశ్వర్లు, సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️