విశాఖ, కర్నూలును అభివృద్ధి చేస్తాం

Apr 13,2024 23:30 #Chandrababu Naidu, #speech

– తాడికొండ, ప్రత్తిపాడు సభల్లో చంద్రబాబు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి:అమరావతి తరువాత విశాఖపట్నం, కర్నూలును కూడా సమాంతర నగరాలుగా అభివృద్ధి చేస్తామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. విశాఖను ఆర్ధిక రాజధానిగా, కర్నూలును హార్టీకల్చర్‌, సీడ్‌ క్యాపిటల్‌గా మార్చి చూపిస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన ప్రసంగించారు. రాజధానిలో 33,000 ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులను వైసిపి నట్టేట ముంచిందన్నారు. రాజధానిలో రోడ్లు తవ్వేసి మట్టి, ఇసుక కూడా దోచుకెళ్లిపోయారని విమర్శించారు. రాష్ట్ర రాజధాని నడిబడ్డున నిలబడి చెబుతున్నా.. అమరావతిని అంగుళం కూడా ఎవ్వరూ కదపలేరన్నారు. రూ.పది కోట్లతో నిర్మించిన ప్రజా వేదికను సిఎం జగన్‌ కూల్చారని, తాము అధికారంలోకి వస్తే మళ్లీ అదే ప్రదేశంలో ప్రజావేదిక నిర్మిస్తామని అన్నారు. ‘కౌరవ సభ నుంచి బయటకు వస్తూ చెప్పా.. గెలిచిన తర్వాత గౌరవ సభగా మార్చి జూన్‌ నాలుగున సభలో అడుగు పెడతాం. ప్రపంచ దేశాలన్నీ అమరావతి వైపు చూడాలని ఆలోచించా. సంపద సృష్టించే కేంద్రంగా తయారు చేయాలనుకున్నాను. జగన్‌ వచ్చాక రాజధాని లేని రాష్ట్రంగా ఎపిని మార్చేశారు. రాజధాని అంటే పెద్ద పెద్ద భవనాలు కాదు.. ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం. వైసిపి ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఆ పార్టీ నేతలకు కమిషన్లు ఇవ్వలేక రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయాయి. బడికి రంగులు వేస్తే విద్యా వ్యవస్థ మారిపోతుందా? రూ.కోట్లు ఖర్చు పెట్టినా జగన్‌ సభలకు జనం రావడం లేదు’ అని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు, పింఛనుదారులకు మళ్లీ ఒకటో తేదీనే జీతాలిస్తామని, పోలీస్‌ శాఖలో ఖాళీగా ఉన్న 26 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, పత్తిపాడు అసెంబ్లీ అభ్యర్థి బి.రామాంజనేయులు, తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్ధిగా తెనాలి శ్రావణ్‌ కుమార్‌ను గెలిపించాలని కోరారు.

➡️