కళ్ల ముందే పంట నీటిపాలు

సిపిఎం బృందాల వద్ద తుపాను బాధితుల ఆవేదన

-ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

-సిఎం ప్రత్యక్షంగా రైతుల బాధలు చూడాలి : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- యంత్రాంగం’ఆరుగాలం ఇంటిళ్లపాదీ కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీటి పాలైంది. నష్టాలు, అప్పులే మిగిలాయి. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు’ అని సిపిఎం బృందాల వద్ద రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే కోలుకోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని తుపాను ప్రాంతాల్లో మూడు సిపిఎం బృందాలు వేర్వేరుగా పర్యటించాయి. రైతులకు జరిగిన నష్టాన్ని కళ్లారా చూశాయి. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాయి. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ధనలక్ష్మి బృందం పర్యటించింది. మోకాలు లోతు నీటిలో దిగి రైతులను కలిసి మునిగిపోయిన వరి పొలాన్ని పరిశీలించింది. పొలానికి పక్కనే ఉన్న మురుగు కాలువ పూర్తిగా నిండిపోవడంతో నీరు మరో వారం రోజుల వరకూ బయటకెళ్లే పరిస్థితి లేదని సిపిఎం బృందం వద్ద రైతులు వాపోయారు. అదే గ్రామంలో వర్షానికి తడిచిపోయిన ధాన్యాన్ని రైతులు బయటకు తీస్తుండడంగా ఈ బృందం అక్కడికి వెళ్లి పరిశీలించింది. ధాన్యాన్ని వడగట్టి పనిలో సహకరించింది. ధాన్యంపై తార్పాలిన్లు కప్పినా వర్షానికి తడిసి లోపల మొలకలు వచ్చిన ధాన్యాన్ని చూపించి రైతులు బోరున విలపించారు.రూ.20 వేల చొప్పున నష్టపరిహారమివ్వాలిమొన్నటి వరకు రైతులు కరువుతో నష్టాలపాలు కాగా, నేడు తుపాను వల్ల కోలుకోలేని విధంగా నష్టపోయారని, రైతులను ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం రూ.20 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. రుణమాఫీ చేసి, రెండో పంటకు కావలసిన విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని కోరారు. బాపట్ల జిల్లాలో తుపాను ముంపు ప్రాంతాల్లో పర్యటనలో ఆయన మాట్లాడుతూ తుపాను ఎక్కడ తీరం దాటుతుందో ముందే తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదన్నారు. మురుగు కాలువలను బాగు చేసే పరిస్థితి లేకపోవడంతో వరద నీరు దిగువకు వెళ్లే వీలులేక పంట పొలాల మీదుగా ప్రవహించడంతో పంటలకు అపార నష్టం వాటిల్లిందని తెలిపారు. ధాన్యానికి ప్రయివేట్‌ మార్కెట్‌ రూ.1700 ధర ఉంటే, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర రూ.1,650 ప్రకటించడం సరికాదన్నారు. తక్షణమే ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు తోడుగా మరో రూ.400 బోనస్‌ ఇచ్చి కొనాలని డిమాండ్‌ చేశారు. కరువు, తుపానుతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని, కౌలు చెల్లించే పరిస్థితిలో లేరని తెలిపారు. కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకం తేవాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి తాడేపల్లిలో ఉండి సమీక్షలు చేయడం కాకుండా పొలాల్లోకొచ్చి ప్రత్యక్షంగా రైతుల కష్టాలను చూడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం బృందాలను పంపి రూ.10 వేల కోట్లయినా రైతులకిచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రెండో పంట సాగు కోసం అవసరమైన మొక్కజన్న, మినుము, పెసర లాంటి విత్తనాలకు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఉచితంగా ఇవ్వాలని కోరారు. తుపాను, భారీ వర్షాలతో జగనన్న కాలనీలన్నీ నీట మునిగాయని, కాలనీవాసులు బయటకు రావాలంటే పడవలు పంపాల్సిన పరిస్థితి ఉందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ఉమామహేశ్వరరావు, నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌లతో కూడిన బృందం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలోనూ, టిపి గూడూరు మండలం నరుకూరు ప్రాంతంలోనూ పర్యటించింది. తుపాన్‌ కారణంగా దెబ్బతిన్న నారుమళ్లు, వరి నాట్లను, మొక్కజన్న చేలను రైతులతో కలిసి పొలంలోకి దిగి పరిశీలించింది. నెల్లూరు పట్టణంలోని వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీ, భగత్‌ సింగ్‌ కాలనీల వాసులు తమను ఎవరూ ఆదుకోలేదని, కనీసం కరెంట్‌, మంచినీటి సదుపాయం లేదని, ఆహారం కూడా అందలేదని ఈ బృందం వద్ద ఏకరువు పెట్టారు. డ్రెయినేజీ, రోడ్లు కనీసం సదుపాయాలు లేనికారణంగా ప్రతిసారీ ఇబ్బందులు పడుతున్నామని ఆర్‌డిఎఫ్‌ కాలనీ, జక్కా వెంకయ్య, ఇందిరమ్మ కాలనీలతోపాటు, కొత్తూరులోని వైఎస్‌ నగర్‌ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తుపాను బాధితులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. కృష్ణా జిల్లాలోని మొవ్వ మండలం నిడుమోలు శివారు వీరాయలంక, గూడూరు మండలం తరకటూరు, మోపిదేవి మండలం మోపిదేవి, మోపిదేవిలంక తదితర ప్రాంతాల్లో తుపానుకు దెబ్బతిన్న పంటలను, మచిలీపట్నంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలో పునరావాస శిబిరంలో వలస కార్మికులకు అందుతున్న సౌకర్యాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబుతో కూడిన బృందం పరిశీలించింది. నష్టపోయిన రైతులు, కౌలు రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎన్యుమరేషన్‌ జరపాలని వై.వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతు, కౌలు రైతులకు నష్టపరిహారం అందించాలి : ఎపి రైతు సంఘం డిమాండ్‌పంటలన్నింటినీ మిచౌంగ్‌ తుపాను ముంచి వేసిందని, నష్టపోయిన ప్రతి రైతు, కౌలు రైతుకు నష్టపరిహారం అందించాలని ఎపి రైతు సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె ప్రభాకరరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. గోదావరి జిల్లాల నుండి నెల్లూరు వరకు డెల్టా జిల్లాల్లో పండిన వరి పంట దెబ్బతిందని, కళ్లాల్లోనూ, రోడ్లపైన ధాన్యం రాశులన్నీ నీరుపట్టాయని తెలిపారు. కోసిన వరి పనలు తడిచిపోయాయని, లక్షలాది ఎకరాల్లో వరి చేలు పడిపోయాయని పేర్కొన్నారు. మెట్ట ప్రాంతాల్లోని మిరప, పొగాకు, పత్తి, పసుపు, అరటి, కూరగాయ పంటలు మొక్కజన్న, సీడ్‌ పంటలు, రెండో పైరుగా వేసిన మినుము, జన్న పంటలన్నీ దెబ్బతిన్నాయని వివరించారు. వెంటనే ఎన్యుమరేషన్‌ చేపట్టాలని, తడిసిన ధాన్యాన్ని నిబంధనలతో పక్కనబెట్టి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, ఆహార పంటలకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున, వాణిజ్య పంటలకు రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. పంటల బీమా పరిహారం ఇవ్వాలని, పేద రైతులకు, వ్యవసాయ కార్మికులకు ఒక నెలకు ఉచితంగా రేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ప్రజాశక్తి - తాళ్లరేవు: తాళ్లరేవు మండలం పటవలలో రాత్రి కురిసిన కుండ పోత వర్షానికి నీట మునిగిన వరి పొలంలో కట్టలు కడుతున్న రైతులు.
ప్రజాశక్తి – తాళ్లరేవు: తాళ్లరేవు మండలం పటవలలో రాత్రి కురిసిన కుండ పోత వర్షానికి నీట మునిగిన వరి పొలంలో కట్టలు కడుతున్న రైతులు.

 

మిచౌoగ్ తుఫాన్ కారణంగా మునగపాక మండలంలో దెబ్బతిన్న పంట పొలాలను ఈరోజు సిపిఎం పార్టీ బృందం పర్యటించి పరిశీలించడమైనది.
మిచౌoగ్ తుఫాన్ కారణంగా మునగపాక మండలంలో దెబ్బతిన్న పంట పొలాలను ఈరోజు సిపిఎం పార్టీ బృందం పర్యటించి పరిశీలించడమైనది.

 

➡️