ప్రతి ఇంటికి మంచి చేశాం

Apr 3,2024 23:20 #ap cm jagan, #speech

– 130 సార్లు బటన్‌ నొక్కి సంక్షేమాన్ని అందించాం
– పింఛన్లపై చంద్రబాబు కుట్ర
– వచ్చే ఐదేళ్లలో ఎవరి వల్ల మంచి జరుగుతోందో ఆలోచించండి
‘మేమంతా సిద్ధం’ సభలో సిఎం జగన్‌
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :’ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రతి ఇంటికి మంచి చేశాం. ఇంటి ఇంటికి మేలు చేస్తూ, పిల్లల భవిష్యత్తు కోసం సత్యనిష్టత ప్రభుత్వం ఒక వైపు ఉంది. మరోవైపు గతంలో మూడు సార్లు అధికారంలో ఉండి అబద్ధం, మోసం, చెడు, చీకటిని రిటర్న్‌ గిప్ట్‌ ఇచ్చే బృందం ఉంది. ఫ్యాను మీద రెండు బటన్లు నొక్కి.. చంద్రముఖిని పెట్టెలో బంధించండి’ అని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఏడో రోజు చిత్తూరు జిల్లా సదుం, పూతలపట్టు మండలల్లో కొనసాగింది. పూతలపట్టులో జరిగిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ.. సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికీ చేరాయన్నారు. తమ హయాంలో 130 సార్లు బటన్‌ నొక్కి సంక్షేమాన్ని అందించామని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. కొత్త కొత్త మోసాలతో ముగ్గురు వస్తున్నారని, సూపర్‌ సిక్స్‌ అంటూ మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతినెలా ఒకటో తేదీన వలంటీర్ల ద్వారా ఇచ్చే పింఛనుపైనా చంద్రబాబు కుట్ర పన్నారని విమర్శించారు. చంద్రబాబు మనిషి నిమ్మగడ్డ ఇచ్చిన ఫిర్యాదు వల్లే వలంటీర్‌ వ్యవస్థను దూరం పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. అవ్వతాతలు పింఛను అందుకునేందుకు నడవలేక పడుతున్న అగచాట్లు చూసినప్పుడు ఈ చంద్రబాబు మనిషా, శాడిష్టా అని అనిపిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తికి మనం ఓటు వేయడం ధర్మమేనా? అని ప్రశ్నించారు. ‘ఒక మనిషి జీవితకాలంలో ప్రతి రోజు విలువైనది. అలాంటిది మీరు ఓటు వేయడమంటే ఏకంగా ఐదేళ్లు మీ భవిష్యత్తు వారి చేతిలో పెట్టినట్లే. మన ఇళ్లలో జరిగే మంచి కానీ, చెడు కానీ చేసే అధికారం వాళ్లకి ఇచ్చినట్లే, వచ్చే ఐదేళ్లలో ఎవరి వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది అని ఆలోచన చేయండి. మీ ఇంట్లో అందరితో చర్చించి, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే మీకు మంచి జరుగుతుందని ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని ప్రజలను కోరారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మీకు, మీ ఇంటికి ఏం చేశాడో ఆలోచన చేయాలని, మీ బ్యాంక్‌ ఖాతాలను గమనించండి, ఆయన పేరు చెబితే ఒక్క స్కీం అయినా గుర్తుకు వస్తుందా..కనీసం మీ ఖాతాలో జమ చేసినట్లు ఒక్క రూపాయి అయిన కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. అదే మీ జగన్‌,.. మీ ఇంటికి, మీ గ్రామానికి ఏం చేశాడో చూసేందుకు ఏ గ్రామానికి వెళ్లినా మంచి కనిపిస్తుందని తెలిపారు. జరగబోతున్న మహా సంగ్రామంలో మంచి వైపు నిలబడి యుద్ధం చేయడానికి సిద్ధం అంటున్న మహాప్రజాసముద్రమిది అని అన్నారు. సిఎం బస చేసిన సదుం మండలం అమ్మగారిపల్లి వద్ద కుప్పం నుంచి ఎమ్మెల్సీ భరత్‌ ఆధ్వర్యంలో, ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి ఆధ్వర్యంలో టిడిపికి చెందిన పలువురు నాయకులు వైసిపిలో చేరారు. పలమనేరుకు చెందిన పట్టు రైతులు సిఎంను కలవడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది ఆపేశారు.

➡️