అభివృద్ధి – సంక్షేమం -చేసి చూపించాం

Mar 28,2024 23:30 #ap cm jagan, #karnool, #speech

– అధర్మంపై ధర్మ యుద్ధానికి సిద్ధం కండి
– నంద్యాల సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి
ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి :ఐదేళ్ల తమ పాలనలో ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించామని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఆయన చెప్పట్టిన బస్సు యాత్ర రెండో రోజు నంద్యాల జిల్లాలో సాగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గురువారం బస్సు యాత్ర ప్రారంభమైంది. సిరివెళ్ళ మండలం ఎర్రగుంట్లలో గ్రామస్తులతో జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. గ్రామానికి వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. అనంతరం యాత్ర నంద్యాలకు చేరుకుంది. నంద్యాల డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడుతూ . ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తున్నామని, లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నామని తెలిపారు. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చామని గుర్తు చేశారు. ఇన్ని చేస్తున్న ఒక్క జగన్‌ను ఎదుర్కునేందుకు ఎన్నో కుట్రలు సాగుతున్నాయ చెప్పారు. కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధం కావాలన్నారు. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు సాధించి డబుల్‌ సెంచరీ సర్కారును ఏర్పాటు చేయాలన్నారు. అధర్మంపై ధర్మ యుద్ధానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. బాబు మోసాలకు చివరి ఎన్నికలు కావాలలని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఐదేళ్లలో గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించాలని, వైసిపి ఐదేళ్ల పాలనపై అందరితోనూ చర్చించాలన్నారు. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగి ఉంటే ఓటు వేయాలని కోరారు. చంద్రబాబు హయాంలో మంచి పనులు చేసిన దాఖలాల్లేవని ఆరోపించారు. ప్రతి అక్కా, చెల్లెమ్మల కుటుంబాల్లో సంతోషాలను చూడాలనే ఏకైక ఉద్దేశంతో బటన్లు నొక్కినట్లు చెప్పారు. నంద్యాల నుండి బయలు దేరి పాణ్యం మీదుగా కర్నూలు జిల్లా నాగలాపురం బస కేంద్రానికి చేరుకున్నారు. బహిరంగ సభలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా, జలవనరుల శాఖ సలహాదారు గంగుల ప్రభాకర్‌ రెడ్డి, మహిళా కమిషన్‌ మాజీ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యేలు, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గన్నారు. ఎర్రగుంట్లలో వికలాంగ దంపతులు ప్రసాద్‌, అపర్ణలు సిఎంతో ఫోటో కావాలని అడగగా సిఎం కింద కూర్చుని ఫోటో దిగి వారితో మాట్లాడారు. ఆళ్లగడ్డ నుంచి యర్రగుంట్లకు వస్తుండగా బత్తులూరు గ్రామం వద్దకు రాగానే అంబులెన్స్‌ వచ్చింది.ఈ క్రమంలో అంబులెన్స్‌కు ముఖ్యమంత్రి బస్సు దారి ఇచ్చింది.

➡️