క్రీడా వజ్రాలను తయారు చేస్తాం -‘ఆడుదాం ఆంధ్ర’ ప్రారంభోత్సవంలో జగన్‌

Dec 27,2023 08:55 #ap cm jagan

– అందరూ వ్యాయమం చేయాలని పిలుపు

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధిరాష్ట్రంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించేందుకు ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం చేపట్టినట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్‌ స్కూల్‌ క్రీడా మైదానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా-2023 పోటీలను ఆయన మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. తొలుత క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ బేసిక్‌, ఫ్రొషిషనల్‌ కిట్లను, విజేతలకు అందించే ట్రోఫీలను పరిశీలించారు. శాప్‌ పతాకాన్ని, జాతీయ జెండాను ఆవిష్కరించారు. క్రీడా జ్యోతిని వెలిగించారు. క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. బెలూన్లు ఎగురవేసి ఆడుదాం ఆంధ్రా 2023 క్రీడా పోటీలను ప్రారంభించారు. సచివాలయ స్థాయిలో క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గనే పురుష, మహిళ క్రీడాకారులకు బేసిక్‌ కిట్లను అందించారు. లయోల పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలోని క్రీడా మైదానంలో ఖో-ఖో, క్రికెట్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ మహిళా, పురుషుల టీముల సభ్యులను ముఖ్యమంత్రి పరిచయం చేసుకున్నారు. ముఖ్యమంత్రి క్రికెట్‌ బ్యాటింగ్‌, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ క్రీడలను సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించడం ద్వారా గ్రామాల్లోని ఆణిముత్యాలను వెతికి సానబెట్టి వజ్రంగా మలచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా విద్యార్థులను తీర్చిదిద్దుతామని వివరించారు. సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయికి వచ్చే టీములను జిల్లా, రాష్ట్ర స్థాయికి తీసుకువెళతామన్నారు. క్రీడల్లో ప్రతిభ కలిగిన ఆణిముత్యాలను వెతికేందుకు ప్రొఫెషనల్‌ లీగ్‌లో ఉన్న టీములన్నీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తాయని తెలిపారు. క్రికెట్‌కు సంబంధించి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందుకొచ్చిందన్నారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ క్రీడాకారులను తీర్చిదిద్దుతుందని వివరించారు. బ్యాడ్మింటన్‌కు సంబంధించి కిడాంబి శ్రీకాంత్‌, పివి సింధూ సహకారంతో మెరుగైన క్రీడాకారులను తీర్చిదిద్దుతామన్నారు. వాలీబాల్‌కు సంబంధించి ప్రైమ్‌ వాలీబాల్‌, కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్లు ముందుకు వచ్చారని తెలిపారు. ‘ఆడుదాం ఆంధ్ర’ ఏటా డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగుతుందన్నారు. సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో 34.19 లక్షల మంది క్రీడాకారులు, 88.66 లక్షల మంది ప్రేక్షకులుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని సిఎం తెలిపారు. 15 వేల సచివాలయాల పరిధిలో 9 వేల ఆట స్థలాలను గుర్తించామన్నారు. రాష్ట్ర మంత్రులు ఆర్‌కె రోజా, విడదల రజనీ, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎంపిలు నందిగం సురేష్‌, ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, స్పోర్ట్సు అథారిటీ చైర్మన్‌ సిద్దార్థ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️