కెసిఆర్‌, కెటిఆర్‌లను జైలుకు పంపుతాం : అమిత్‌ షా

 

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ‘త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంది. పదేళ్లలో ప్రజల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఒక్క మంచి పనీ చేయలేదు. కుమారుడు కెటిఆర్‌ కోసం లక్షల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టారు. కెసిఆర్‌, కెటిఆర్‌ అక్రమాలు, అవినీతిపై విచారణ జరిపి వారిని జైలుకు పంపిస్తాం’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణం పెర్కిట్‌లోని బైపాస్‌ రోడ్డులో శుక్రవారం బిజెపి ఆధ్వర్యాన నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మియాపూర్‌, చేవెళ్లలో భూములు కబ్జా అయ్యాయని, ఔటర్‌ రింగ్‌ రోడ్‌లో స్కాం, కల్వకుంట్ల కవిత మద్యం దందా నిర్వహించి కోట్లు సంపాదించారని ఆరోపించారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా గల్ఫ్‌ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉజ్వల యోజన కింద మహిళలకు నాలుగు గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని తెలిపారు. బిజెపి అధికారంలోకి వస్తే పరీక్ష పత్రాలను లీకేజీ చేసిన వారిని జైలుకు పంపుతామన్నారు.

➡️