ఇండియా వేదిక అభ్యర్థులను ఆదరించండి

– సిఐటియు రాష్ట్ర పధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు
ప్రజాశక్తి-నెల్లూరు :కార్మిక వర్గం వెన్నంటి ఉంటూ పోరాటాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొని మద్దతు ఇస్తున్న వామపక్ష పార్టీలను ఆదరించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు కోరారు. అన్ని రంగాల్లో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకోవాలని తెలిపారు. నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆయన ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడి ప్రభుత్వం కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానలను అమలు చేసిందన్నారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాసే విధంగా మోడీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపి విధానాలను అమలు చేస్తున్నాయన్నారు. కనీస వేతనం అనేదే లేదని, కనీస వేతనాలు అమలు చేయకుండా అడ్డుపడే విధానాలు అమలు చేశారని, నూతనంగా ఎటువంటి ఉద్యోగ నియామకాలు జరపకపోగా, పర్మినెంట్‌ నియామకాల ఊసే లేదన్నారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విధానాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. కార్మిక వర్గానికీ హక్కులు అమలు కావడంలేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్న వైసిపి ప్రభుత్వానికి, ఎన్‌డిఎ పార్టీలను ఓడించాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్‌వి నరసింహారావు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.

➡️