సంక్షేమానికి, సర్కారు నిర్వహణకు నిధులెలా ?

  • ఆర్థిక సలహాదారులు, అధికారులతో సిఎం కీలక సమావేశం
  • మ్యానిఫెస్టోపైనా చర్చ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన నిధుల సమీకరణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టి సారించారు. గురువారం సాయంత్రం ఈ అంశంపై కీలకసమావేశం నిర్వహించారు. ప్రస్తుత మున్న సంక్షేమ పథకాలతో పాటు, భవిష్యత్తులో మరిన్ని తీసుకువస్తే ఆర్థికిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. మ్యానిఫెస్టోలో పెట్టాలని భావిస్తున్న అంశాలపై సలహాలను కూడా తీసుకున్నట్లు సమాచారం.ఈ సమావేశంలో సిఎం ఆర్థిక సలహాదారు దువ్వూరి కృష్ణతో సహా పలువురు ప్రత్యేక ప్రధానకార్యదర్శి స్థాయి అధికారులు పాల్గొన్నారు.రోజువారీ ప్రభుత్వ నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు, ఇటీవల జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఉద్యోగులు లేవనెత్తిన ఆర్థికపర అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రతివారం జరిగే సమావేశం అయినప్పటికీ తాజా సమావేశంలో సమావేశంలో అత్యంత కీలకమైన విషయాలనూ చర్చించారని తెలిసింది.యువత, రైతులు, మహిళలు, విద్యార్థులకు అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, వాటికి అయ్యే ఖర్చు, ప్రస్తుత నిర్వహణకు కావాల్సిన ఆర్థిక మొత్తాలు ఎలా సమకూర్చుకోవాలనే అంశాలు ఈ చర్చలో చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఇటీవల ఉద్యోగులతో జరిగిన సమావేశంలోనూ ఈ నెలలో ఆర్థిక అంశాల ప్రస్తావన తేవొద్దని మంత్రులు, సలహాదారులు స్పష్టంగా చెప్పారు. ఇదే అంశాలను సిఎం ముందు కూడా ఉంచారు. రాబడి ఎంత, ఖర్చు ఏమిటి, ఈ మూడు నెలల్లో ఎంత అదాయం వస్తుందనే అంచనాలను సిఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇప్పటి వరకూ వేర్వేరు రూపాల్లో తీసుకున్న నిధులు, ఇంకా ఏ రూపంలో వచ్చే అవకాశం ఉందనే అంశాలను దువ్వూరి కృష్ణ సిఎంకు తెలిపినట్లు సమాచారం. అదాయాలను దృష్టిలో ఉంచుకుని మ్యానిఫెస్టోలో చేర్చే అంశాలపైనా సమగ్ర నివేదిక తయారు చేయాలని సలహాదారులకు సిఎం సూచించినట్లు తెలిసింది.

➡️