రెండో నిందితుడు ఎవరు ?

-సిఎంపై రాయి కేసులో కొనసాగుతున్న అస్పష్టత
-వైసిపి, టిడిపి పరస్పర ఆరోపణలు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సిఎం కేసులో ప్రధాన అనుమానితుడిని అరెస్టు చేసి రిమాండు చేసినప్పటికీ రెండో అనుమానితుడు ఎవరనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రశాంతంగా ఉన్న సింగ్‌నగర్‌ ప్రాంతంలో ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సిఎంపై దాడి అనంతరం ఆ ప్రాంతం మొత్తం ఉద్విగ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఎవరొచ్చి యువకులను తీసుకెళతారో అనే ఆందోళన ఆ ప్రాంతంలో నెలకొంది. దీనికితోడు వైసిపి, టిడిపి పరస్పర విమర్శలతో సెంట్రల్‌ నియోజకవర్గంలో భయానక వాతావరణం నెలకొంది. సిఎంపై దాడి ఘటనలో వేముల సతీష్‌ను ప్రేరేపించింది ఎవరనే అంశంపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. వేముల దుర్గారావు అనే వ్యక్తి సతీష్‌ను రెచ్చగొట్టాడని, అతనే రెండో నిందితుడని వైసిపి నాయకులు చెబుతున్నారు. మరో కీలక నేత ప్రోద్బలంతోనే దుర్గారావు దాడి చేయించాడని పేర్కొంటున్నారు. పోలీసులు కోర్టుకు సమర్పించిన సతీష్‌ రిమాండు రిపోర్టులో విచారణ ఇంకా పూర్తికాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీని వెనుక ఎవరున్నారన్న అంశంపై చర్చ సాగుతోంది. వేముల దుర్గారావు టిడిపిలో పనిచేస్తున్నారు. బండా ఉమకు ముఖ్య అనుచరుడిగానూ ఉన్నారు. ఈ కోణంలో బోండా ఉమకు ఈ కేసుతో సంబంధం ఉందని వైసిపి నాయకులు చెబుతున్నారు. అయితే సానుభూతి కోసం వారే దాడి చేయించుకున్నారని, వేముల సతీష్‌ చుట్టుపక్కల కుటుంబాల వారికి డబ్బులిచ్చి సిఎం కార్యక్రమానికి తీసుకెళ్లారని, వైసిపి నాయకులకు తెలియకుండా దాడి ఎలా జరుగుతుందని టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో నిందితుడు ఎవరనేది పోలీసులు బయటపెడితేనే అసలు వ్యవహారం ఎక్కడ జరిగిందనే అంశంపై స్పష్టత వస్తుంది. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న సెంట్రల్‌ నియోజకవర్గంలో ఇప్పుడు కొత్తగా జరుగుతున్న అనేక ఘటనల నేపథ్యంలో టిడిపి, వైసిపి తీరుపై నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

➡️