ఇప్పటికి 3 రోజులు.. పింఛను అందుతుందా ?

May 3,2024 12:35

బుచ్చిపాలెం (తూర్పు గోదావరి) : నడవలేని స్థితిలో ఉన్న ముసలివారికి పింఛన్లు అందడం లేదు.. మండుటెండల్లో ఆపసోపాలు పడుతూ బ్యాంకుల వద్దకు పోతే అక్కడ కనీసం ఫ్యాన్లు కూడా లేవు.. ఖాతా పనిచేయడం లేదని, నిబంధనలు ఉన్నాయని, విట్నెస్‌ సంతకాలు కావాలని బ్యాంకులవారు షరతులు చెబుతుంటే…. ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ముసలివారు నిరాశగా బిక్కమొహం వేసుకొని కూర్చుంటున్నారు. వృద్ధులు వారికేమీ తెలీదు అనే కనీస కనికరం కూడా లేకుండా బ్యాంకు సిబ్బంది వారిపట్ల కఠినంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికి 3 రోజులు.. ఎండలో తిరుగుతూ, బ్యాంకుల్లో పడిగాపులు కాస్తూ పింఛను అందుతుందో, లేదో తెలీక ఆ ముసలి ప్రాణాలు పడే అవస్థలు ఇన్నీ అన్నీ కావు..!

గోపాలపురం బ్యాంకు వద్ద వృద్ధులు ప్రజాశక్తితో తమ గోడు వెళ్లబోసుకున్నారు..
మండలంలోని బుచ్చిపాలెం గ్రామానికి చెందిన జక్కుల అమ్మిరాజు అనే వృద్ధుడు గత రెండు రోజులుగా పింఛన్‌ కోసం 10 కిలోమీటర్ల దూరం నుండి గోపాలపురం బ్యాంకు చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నాడు. తన ఖాతా నంబరు పని చేయకపోవడంతో దానిని బతికించడానికి ముప్పుతిప్పలు పడుతున్నానని ఆవేదన చెందాడు. సంవత్సరం నుండి తాను రెండు కాళ్లు కీళ్లవాతంతో బాధపడుతూ నడవలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయాడు. మారుమూల ప్రాంతం కావడంతో వాహనాలు కూడా తిరిగే పరిస్థితి లేదని, తన ఇంటికి వెళ్లేందుకు ఎవరినైనా లిఫ్ట్‌ ఆడిగి వెళుతున్నానని కంటతడిపెట్టాడు. వేలిముద్ర వేసేవారు తప్పనిసరిగా మరొక ఖాతా నంబరు ఉన్న వ్యక్తితో విట్నెస్‌ సంతకం కావాలనేది బ్యాంకు వారి నిబంధన. దీంతో వృద్ధులంతా మరింత అవస్థలు పడుతున్నామని తెలిపారు. మండుటెండలో గొంతెండి వస్తుంటే … కనీసం బ్యాంకుల్లో సరైన ఫ్యాన్లు కూడా లేకపోవడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ముసలివారు వాపోయారు. బ్యాంకువారు వృద్ధుల పట్ల కనీసం మానవ దృక్పథం చూపించకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని నలుమూలల నుండి పింఛన్‌ కోసం పెద్ద ఎత్తున బ్యాంకు వద్దకు వృద్ధులు చేరుకున్నారు. డబ్బులు తీసుకునేందుకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పింఛనుదారులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

➡️