ఎన్నికల నిబంధలు సక్రమంగా అమలు చేయాలి

  •  ఎపి యునైటెడ్‌ ఫ్రంట్‌ అభ్యర్థులను గెలిపించండి : లక్ష్మీనారాయణ

ప్రజాశక్తి – మంగళగిరి(గుంటూరు జిల్లా) : ఎన్నికల నిబంధనలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండాలని, వాటిని సక్రమంగా అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలసి వినతిపత్రం అందజేస్తామని ఎపి యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాలు నానాటికీ దిగజారిపోతున్నాయన్నారు. వైసిపి, టిడిపిలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకురాలేదని, ఇటీవల చిలకలూరిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీ కూడా నోరు మెదపలేదని గుర్తు చేశారు. ప్రజాసమస్యలను నెరవేర్చని వైసిపి, టిడిపి, బిజెపిలను కాదని ప్రజలు ప్రత్యామ్నయం వైపు చూస్తున్నారని, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిజాయితీతో పని చేస్తున్న ఎపి యునైటెడ్‌ ఫ్రంట్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. చట్టసభల్లో ప్రజా సమస్యలపై వాణి వినిపించాలంటే ఎనిమిది పార్టీలతో ఏర్పడిన ఎపి యునైటెడ్‌ ఫ్రంట్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రంట్‌ తరుపున మంగళగిరి నియోజకవర్గ నుంచి పోటీ చేస్తున్న నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు షేక్‌ జలీల్‌కు మద్దతివ్వాలని కోరారు. ఫ్రంట్‌ కో-కన్వీనర్‌ భాగ్యరావు మాట్లాడుతూ.. రూ.కోట్లకు పడగలెత్తిన ధనవంతులను కాకుండా సామాన్యులను చట్టసభలకు పంపించాలనే లక్ష్యంతో ఈ ఫ్రంట్‌ ఏర్పడిందన్నారు. అంతకుముందు డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ , బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మీడియా సమావేశంలో దాసరి చెన్నకేశవులు, రఘు, నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్‌ జలీల్‌, చిట్టి బాబు పాల్గొన్నారు.

➡️