దేశ రక్షణకు ఇండియా వేదికను గెలిపించండి

May 11,2024 08:27 #kishore chandradev, #press meet

-బిజెపిని, దాని పొత్తు, తొత్తు పార్టీలను సాగనంపండి
-నేను కోరుకునే మనుషులకు ఒక్కసారి అవకాశమివ్వండి : కిశోర్‌ చంద్రదేవ్‌
ప్రజాశక్తి- కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) :బిజెపి పాలనలో దేశానికి, ప్రజలకు ప్రమాదమని, ఈ దృష్ట్యా దేశ రక్షణకు ఇండియా వేదిక బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ పిలుపునిచ్చారు. సిపిఎం అరకు పార్లమెంట్‌ అభ్యర్థి పి.అప్పలనర్సకు, కురుపాం అసెంబ్లీ అభ్యర్థి మండంగి రమణకు తాను మద్దతు ప్రకటిస్తున్నానని, ప్రజలు కూడా తాను కోరుకునే ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. శుక్రవారం కురుపాం కోటలో సిపిఎం ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి ఎన్‌డిఎ వేదికలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ తాను ఆ పార్టీకి రాజీనామా చేశానని, తాను రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లో లేనని, సిద్ధాంతపరమైన రాజకీయాలు తనకు అవసరమని చెప్పారు. బిజెపి మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని విమర్శించారు. ఆదివాసులను అడవులకు, అటవీ ఫలసాయాలకు దూరం చేసి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోందన్నారు. గిరిజనులకు రక్షణగా ఉన్న చట్టాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. గిరిజన విద్యార్థుల కోసం ఏకలవ్య పాఠశాలలను తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నిధులు మంజూరు చేసి నిర్మించామన్నారు. బబ్బిలి, పార్వతీపురం, మానాపురం రైల్వే బ్రిడ్జిలను అప్పటి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దగ్గరికి వెళ్లి తానే స్వయానా మంజూరు చేయించి తీసుకొచ్చానని, వీటిని ప్రధానమంత్రి మోడీ, టిడిపి అధినేత చంద్రబాబు తాము చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో గుమ్మడిగెడ్డ మినీ రిజర్వాయకు రెండుసార్లు ప్రణాళిక తయారు చేసి అసెంబ్లీకి పంపిస్తే తిరస్కరించారని, వైసిపి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన పుష్ప శ్రీవాణి ఈ పనులు చేయలేకపోయారని వివరించారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం వాటిని తుంగలో తొక్కుతున్నారన్నారు. బిజెపి, మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్న, ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రులపై లేనిపోని కేసులు పెట్టి కక్షపూరిత రాజకీయాలతో అరెస్టులు చేస్తున్నారని తెలిపారు. సామాన్య ప్రజలకు మోడీ ప్రభుత్వంలో ఏమి న్యాయం జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. అటువంటి పార్టీతో మన రాష్ట్రంలో టిడిపి పొత్తు పెట్టుకోవడం, వైసిపి తొత్తుగా మారడం శోచనీయమన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే తాను కోరుకున్న ఇండియా వేదిక అభ్యర్థులైన రమణ, అప్పలనర్సలను సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ, సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి, మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు తదితరులు పాల్గన్నారు.

➡️