మీ ఓటుతో ఢిల్లీ పీఠం కదలాలి

May 7,2024 23:15 #ap cm jagan, #speech

– ఎన్‌డిఎ గెలిస్తే ఉక్కు పరిరక్షణ అసాధ్యం
– కోరుకొండ, ఇచ్ఛాపురం, గాజువాక సభల్లో సిఎం జగన్‌
ప్రజాశక్తి – యంత్రాంగం:’మీ ఎన్‌డిఎ కూటమితో ఆంధ్రప్రదేశ్‌కు ఏం హామీ ఇస్తున్నారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్‌ జతకట్టారా? రైల్వే జోన్‌ కోసం కూటమి కట్టారా? వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేట్‌పరం చేయడం లేదని మీరు జట్టుకట్టారా? 2024 ఎన్నికల్లో ఎన్‌డిఎకి ఓటేస్తే ఉక్కు అమ్మకమే కాదు రాష్ట్రానికి ఇంకా అన్యాయం జరుగుతుంది’ అని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పేదలకు పథకాలు అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఢిల్లీ పీఠం కదిలేలా మీ ఓటుతో తీర్పు ఇవ్వాలని కోరారు. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని, జూన్‌ నాలుగో తేదీ తర్వాత అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, విశాఖ పాత గాజువాక జంక్షన్‌ వద్ద నిర్వహించిన సభల్లో ఆయన ప్రసంగించారు. గాజువాకలో టిడిపికి ఓటు వేసి గెలిపిస్తే అదే ప్రజాభిప్రాయంగా (రిఫరెండం)గా ఎన్‌డిఎ కూటమి భావించి స్టీల్‌ప్లాంట్‌ అమ్మకానికి ఆమోదం లభించిందని ముందుకెళ్తుందన్నారు. ఈ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ఓటు ద్వారా కూటమికి బుద్ధి చెప్పాలని కోరారు. ‘చంద్రబాబు పార్టీలు మార్చే వ్యక్తి అని, వెన్నుపోట్ల చరిత్ర గలవారని, అత్యంత అవినీతి పరుడని 2019లో చెప్పిన మోడీ.. 2024లో ఎన్‌డిఎ కూటమిలో చేరగానే నీతివంతుడైపోయారా? గెలవడం కోసం మోడీ ఇన్నీ అబద్ధాలు మాట్లాడడం ఘోరం’ అని అన్నారు. రైల్వే జోన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపిస్తే కేంద్రం లిటిగేషన్లతో జోన్‌ పనులను ఆపేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమం తప్ప అభివృద్ధి లేదంటూ చెప్పేవారికి రూ.2.70 లక్షల కోట్లను ప్రజలకు నేరుగా పథకాల కోసం వెచ్చించిన విషయం కనపడడం లేదా అని ప్రశ్నించారు. పేదలకు పథకాలు అందించేందుకు కోర్టుకు వెళ్లి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే కుట్రలు, కుతంత్రాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవాలన్నారు. అవ్వాతాతలకు చివరి రెండు నెలలు పింఛన్‌ సొమ్ము ఇంటికి రానివ్వకుండా ఎవరు అడ్డుకున్నారో తెలియకుండా ఉంటుందా? అని ప్రశ్నించారు. పథకాలు ఆపగలిగినా తన విజయాన్ని అడ్డుకోలేరన్నారు. కోరుకొండ భూముల రిజిస్ట్రేషన్‌ వ్యవహారం గురించి ఎమ్మెల్యే రాజా తన దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చారని, ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. మళ్లీ వైసిపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

➡️