కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాడాలి

– పర్స సత్యనారాయణ శతజయంతి సభలో వక్తలు
ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ (పశ్చిమగోదావరి జిల్లా) :కార్పొరేట్‌ శక్తులను, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కోవాలంటే మరింత చైతన్యవంతంగా ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని త్యాగరాజ భవనంలో పర్స సత్యనారాయణ శతజయంతి సందర్భంగా సిఐటియు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌ అధ్యక్షతన బుధవారం సదస్సులు నిర్వహించారు. తొలుత పర్స సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిఐటియు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పర్స సత్యనారాయణ చిన్నతనం నుంచి పీడిత ప్రజల పక్షాన నిలబడిన పోరాటయోధుడని, బగ్గు గని కార్మికుడిగా, కార్మిక నాయకుడిగా, శాసనసభ సభ్యునిగా అనేక బాధ్యతలు నిర్వహించి కడవరకు పీడిత ప్రజల పక్షాన నిలబడిన యోధుడని వక్తలు కొనియాడారు. అనంతరం ‘నేటి కార్మికవర్గం – ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ.. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై పోరాటాలు సాగించి కార్మికులు అనేక చట్టాలు, హక్కులు సాధించుకున్నారని అన్నారు. నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత కార్మికులకు కష్టాలు, ఇబ్బందులు పెరిగాయని తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలను పూర్తిగా మార్చేసి కార్మికుల జీవనోపాధి దెబ్బతీసే విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా సిఐటియు కార్మికుల పక్షాన పోరాడుతోందని తెలిపారు. రానున్న కాలంలో మరింత విస్తృతంగా పోరాడాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
‘అభివృద్ధిాసంక్షేమం’ అనే అంశంపై ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమం చాలా ముఖ్యమైనవని తెలిపారు. అభివృద్ధి అంటే ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల్లో ఆహారం, తాగునీరు, విద్య, వైద్యం వంటి వాటి అభివృద్ధి ఎలా ఉందో ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందని తెలిపారు. వీటితోపాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పాలకులు అభివృద్ధి, సంక్షేమాన్ని ఓట్లతో కొలుస్తున్నారని, పథకాలన్నీ ఓట్ల పథకాలుగా మార్చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఏ మేరకు అమలు చేశామనే దానిపై ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకులు ఆ విధంగా లేకపోవడం బాధాకరమన్నారు. ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు పి.రాము, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మాజీ నాయకులు మంతెన సీతారాం, పర్స సత్యనారాయణ కుమార్తె లీల మాట్లాడుతూ పర్స సత్యనారాయణ జీవిత విశేషాలు, ప్రజల కోసం ఆయన చేసిన ఉద్యమాలు వివరించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు, రైతుసంఘం నాయకులు బి.బలరాం, చింతకాయల బాబూరావు, సిఐటియు నేతలు బి.వాసుదేవరావు, కర్రి నాగేశ్వరరావు, పివి ప్రతాప్‌, శ్రామిక మహిళా నాయకురాలు కళ్యాణి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజా యోధుడు పర్స పుస్తకాన్ని ఆవిష్కరించారు.

➡️