ప్రజాశక్తి వార్తకు స్పందన – నార్పలలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రావణి

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : ప్రజాశక్తిలో ప్రచురితమైన వార్తకు ఎమ్మెల్యే శ్రావణి స్పందించారు. నార్పల ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడి వైద్యులను ప్రజాశక్తిలో వచ్చిన కథనంపై ఆరా తీశారు. అక్కడి సమస్యలను పరిశీలించి తగు చర్యలు చేపడతామన్నారు. మండల కేంద్రమైన నార్పలలో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శనివారం ఆకస్మిక పర్యటన చేశారు. నార్పల ప్రాథమిక వైద్యశాల, కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్‌ ఆవరణలోని నిలిచిపోయిన డ్రైనేజీ ను పరిశీలించారు. పలువురు ప్రయాణికులతో మాట్లాడుతూ … ప్రయాణికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ‘ ప్రాథమిక వైద్యశాలలో ఐయువి కిట్‌ ల కొరత – ఇబ్బందుల్లో రోగులు ‘ అన్న కథనం ప్రజాశక్తి దినపత్రికలో శుక్రవారం ప్రచురితం కావడంతో దానిపైన ఎమ్మెల్యే ప్రత్యేకంగా వైద్యుడు ప్రవీణ్‌ కుమార్‌ సిహెచ్‌ఓ బాలాజీ లను అడిగి విచారించారు.

ఏప్రిల్‌ నెల నుంచి ఐయూవీ కిట్లు సరఫరా నిలిచిపోయిందని దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రోగులే బయట నుండి ఐ యు వి కిట్లు తెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే కి వారు తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలకు వైద్యం కోసం వచ్చేవారు చాలామంది నిరుపేదలేనని అలాంటివారిపై ఆర్థిక భారం మోపడం భావ్యం కాదని ఎమ్మెల్యే అన్నారు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయని ముఖ్యంగా ఎక్కడ చూసినా డయేరియా సమస్య అధికంగా ఉందని వెంటనే ఐ యు వి కిట్లు వైద్యశాలకు వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక వైద్యశాలలో గత మూడు సంవత్సరాల నుండి గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ లేక స్కానింగ్‌ యంత్రం నిరుపయోగంగా మారి స్కానింగ్‌ పరీక్షల కోసం గర్భిణీ స్త్రీలు అనంతపురానికి వెళుతున్నారన్న విషయం పాత్రికేయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, సాధ్యమైనంత త్వరలో నార్పల వైద్యశాలకు గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.

ఆస్పత్రిలో అర్ధాంతరంగా కొన్ని నిర్మాణాలు ఆగిపోయాయని వాటిపైన కూడా విచారణ చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. వైద్యశాలలో ఉన్న సమస్యల పైన ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలని వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే శ్రావణి సూచించారు. అనంతరం పక్కనే ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పక్కనే నిర్మాణంలో ఉన్న కస్తూర్బా గాంధీ జూనియర్‌ కళాశాల భవనాలను ఎమ్మెల్యే పరిశీలించి సాధ్యమైనంత త్వరలోనే పెండింగ్‌ పనులను పూర్తి చేసి త్వరలోనే కస్తూర్బా గాంధీ జూనియర్‌ కళాశాలను బాలికల సౌకర్యార్థం ప్రారంభిస్తామని తెలిపారు. నార్పల బస్టాండ్‌ ఆవరణములో ప్రయాణికులకు బస్టాండ్‌ సౌకర్యం కూడా లేదని కూతలేరు వంతెన నిర్మాణ సమయంలో తొలగించిన గాంధీ విగ్రహాన్ని కూడా తిరిగి ఏర్పాటు చేయలేదని సిపిఐ నాయకులు గంగాధర్‌ తదితరులు ఎమ్మెల్యే కు వినతిపత్రం సమర్పించారు. బస్టాండ్‌ ఆవరణములో రోడ్డు నిర్మాణ సమయంలో డ్రైనేజీ కాల్వ తొలగించడంతో డ్రైనేజీ నీరు ఎక్కడికక్కడ స్తంభించిపోయి దుర్వాసన వెదజల్లుతూ స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని పలు రోగాలు ప్రబలుతున్నాయని పలువురు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆ నిలిచిన డ్రైనేజీని పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే దానిని శుభ్రం చేయించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే తో పాటు టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఆలం నరస నాయుడు, టిడిపి నాయకులు ఆకుల విజరు కుమార్‌, ఆలం నాగార్జున నాయుడు, ప్రతాప్‌ చౌదరి, పిట్టు రంగారెడ్డి, తెలుగు యువత నాయకుడు చంద్రబాబు, మాజీ వైస్‌ ఎంపీపీ తిప్పన్నా, మాజీ కోఆప్షన్‌ సభ్యులు సాలెహ, గుమ్మడం రాధాకఅష్ణ, ఇస్మాయిల్‌, నాగభూషణం, రాజేంద్ర, వెంకటంపల్లి, సాయినాథ్‌, జనసేన నాయకులు గంజిగుంట రామకఅష్ణ, తుపాకుల భాస్కర్‌, ఎంపీడీవో రాముడు, ఈ ఓ ఆర్‌ డి శైలజా రాణి, ఎస్సై రాజశేఖర్‌ రెడ్డి, ఎంఈఓ కఅష్ణయ్య, మేజర్‌ పంచాయతీ కార్యదర్శి అస్వర్తనాయుడు, వివిధ శాఖల అధికారులు, వివిధ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, టిడిపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️