టిడిపికి టచ్‌లో వైసిపి ముఖ్య నేతలు 

Feb 15,2024 09:59 #join tdp, #TDP
ycp leaders ready to join in tdp

అందరినీ తీసుకోలేమని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టీకరణ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి ముఖ్య నేతలు టిడిపికి టచ్‌లోకి వస్తున్న మాట నిజమేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అందరినీ పార్టీలోకి తీసుకోలేమని, అన్నీ ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నట్లు సమాచారం. ఉండవల్లిలోని ఆయన నివాసంలో బుధవారం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, పార్టీ సీనియర్‌ నాయకులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌, గొట్టిపాటి రవికుమార్‌, కంభంపాటి రామ్మోహన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పొత్తులు, కొత్త చేరికల వల్ల పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన నేతల రాజకీయ భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడటానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చంద్రబాబు అన్నట్లు సమాచారం. వైసిపి నేతలు తమకు కూడా టచ్‌లోకి వస్తున్నారని చంద్రబాబు దృష్టికి నేతలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికలకు కేవలం 56 రోజులు మాత్రమే ఉందని, పార్టీ నేతలు పూర్తిగా ఎలక్షన్‌ మూడ్‌లోకి రావాలన్నారు. రా.. కదలిరా సభలు, లోకేష్‌ శంఖారావం మీటింగ్‌తో పాటు వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని నేతలకు చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం.

➡️