వైసిపి, టిడిపి దొందూ..దొందే..!

May 9,2024 06:40 #BV Raghavulu, #press meet
  •  వాటి విధానాల్లో ఎలాంటి మార్పులూ లేవు
  •  సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసిపి, టిడిపి దొందూ..దొందేనని, వాటి విధానాల్లో ఎలాంటి మార్పులూ లేవని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. నెల్లూరులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. దేశంలో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఎన్నికల్లో మూడు పక్షాలు పోటీలో ఉన్నాయని, రాష్ట్రంలో ఓ వైపు అధికార వైసిపి, ప్రతిపక్ష పార్టీ టిడిపి, బిజెపి, జనసేన మరోవైపు, అఖిల పక్ష స్థాయిలో ఇండియా వేదిక భాగస్వాములైన కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ ఇతర పార్టీలు ఓ వైపున పోటీ చేస్తున్నాయన్నారు. రాజకీయంగా, సిద్ధాంత, విధాన పరంగా చూసినప్పుడు రాష్ట్రంలో మూడు పార్టీలు కాదని, రెండు పార్టీలు మాత్రమే పోటీలో ఉన్నాయని తాము భావిస్తున్నామని చెప్పారు. వైసిపి, బిజెపి, టిడిపి, జనసేన పార్టీల్లో విధాన, సిద్ధాంత పరమైన విభేదాలు ఏమీ లేవని విమర్శించారు. వారి మధ్య వ్యక్తిగత దూషణలు, అధికార కోసం పోటీ తప్ప విధానపరమైనవి ఏమీ లేవన్నారు. తన అవినీతి నుంచి బయటపడడానికే మోడీతో జగన్‌ రహస్య ఒప్పందం చేసుకున్నారని ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యానించారని, ఐదేళ్లపాటు జగన్‌ అవినీతిని రక్షించిన మోడీతో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమను తాము రక్షించుకునేందుకు మోడీతో జగన్‌, చంద్రబాబు జత కట్టారని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చినప్పుడు ఇద్దరు నేతలు మద్దతు తెలిపారని, ఇప్పుడు ఇద్దరూ అమలు జరపబోమని ఇప్పుడు మోసపూరిత మాటలు చెబుతున్నారని వివరించారు. ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించింది ఇండియా వేదిక పార్టీలేనని గుర్తు చేశారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్లు పెట్టాలని మోడీ చెప్పారని, ఇందుకు జగన్‌ అంగీకరించారని, ఈ అంశంపై చంద్రబాబునాయుడు గుమ్మనంగా ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ల్యాండ్‌ గ్యాబ్రింగ్‌ యాక్ట్‌ అని చెబుతున్నారని, దీనిని దేశవ్యాపితంగా అమలు చేయాలని మోడీ చెబుతున్నారని, దీనికి వారు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇండియా వేదిక వల్లే దేశానికి, రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి కె. రాజు, నెల్లూరు నగర అసెంబ్లీ అభ్యర్థి మూలం రమేష్‌ను గెలిపించాలని కోరారు. వీరు చట్టసభలకు వెళ్తే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, నెల్లూరు నగర సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ పాల్గొన్నారు.

➡️