రాజధాని జిల్లాల్లో వైసిపి ఓటమి

Jun 5,2024 00:15 #2024 election, #YCP
  • ఐదు పార్లమెంటు స్థానాల్లో కూటమి క్లీన్‌ స్వీప్‌
  • 33 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి,బిజెపి, జనసేన అభ్యర్థుల విజయం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మూడు రాజధానుల నినాదం వైసిపి కొంప ముంచింది. రాజధాని అమరావతి మార్పు ప్రభావం కేవలం గుంటూరు జిల్లాలోనే కొంత ఉంటుందని మిగతా జిల్లాల్లో పెద్దగా ఉండదని అతివిశ్వాసంతో ఉన్న వైసిపికి ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కూడా ఘోర పరాజయం ఎదురైంది. 2019 ఎన్నికల్లో ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం, బిజెపితో టిడిపి విభేదించడం వల్ల కొన్ని సామాజిక తరగతుల ఓట్లు వైసిపికి అనుకూలంగా వచ్చాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణలతో వైసిపికి కొన్ని తరగతుల ప్రజలు దూరమయ్యారు. జనసేన, బిజెపికి అభిమానించే సామాజిక తరగతుల ఓట్లు టిడిపికి అనుకూలంగా రావడం వల్ల ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో వైసిపి ఘోర పరాజయం పాలైంది. రాజధాని జిల్లాల్లో వైసిపికి ఎదురీత తప్పదని ముందే భావించినా ఈ స్థాయిలో ఓటమి ఎదురవుతుందని ఊహించలేకపోయామని వైసిపి అభ్యర్థులు పలువురు వ్యాఖ్యానించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో సిఎం జగన్‌ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారు. దీంతో అమరావతి నిర్వీర్యం అయిందంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగించాలని కోరుతూ రైతులు 1630 రోజులపాటు సుదీర్ఘకాలం ఉద్యమం నిర్వహించారు. గత నాలుగున్నర ఏళ్లుగా ఉద్యమం జరుగుతున్నా ఈ ఉద్యమాన్ని హేళన చేయడం, పెయిడ్‌ ఆర్టిస్టులంటూ రైతులపై నిందలు వేయడం, రియల్టర్లు నడిపిస్తున్నారని ఎదురుదాడి చేయడం ద్వారా వైసిపికి తీవ్ర నష్టం జరిగింది. రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు ఇంత వరకు రిటర్నబుల్‌ ప్లాట్లు దక్కలేదు. కాగితాల్లో ఈ ప్లాట్లు ఇచ్చారు. అభివృద్ధి చేసి అప్పగించలేదు. రిటర్నబుల్‌ ప్లాట్లు అప్పగించడం తమ వల్ల కాదని, ఇందుకు రూ.లక్ష కోట్లు అవసరం అవుతాయని, అంతనిధులు తమ వద్దలేవని ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీంతో, మళ్లీ వైసిపి అధికారంలోకి వస్తే తమకు ప్లాట్లు ఇప్పట్లో దక్కవని భావించిన రైతులు పూర్తి స్థాయిలో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. వీరితో పాటు రాజధానిలో స్థలాలు, పొలాలు కొనుగోలు చేసిన వారు కూడా ఈ ప్రభుత్వం ఉంటే రాజధాని అభివృద్ధి చెందదని భావించి వైసిపికి వ్యతిరేకంగా ఓటు వేశారు. రాజధాని నిర్వీర్యం వల్ల నిర్మాణ రంగం దెబ్బతినడంతో భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణదారులు, ఈ రంగాలపై ఆధారపడిన ఇతర వర్గాలు వారు కూడా వైసిపికి దూరమయ్యారు. రాజధాని ప్రాంతంతోపాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండటం వల్ల ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర సామాజిక తరగతుల వారు వ్యతిరేకంగా పనిచేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోపాటు అభ్యర్థుల ఎంపికపై స్థానిక నేతలతో కనీసం చర్చించకుండా ఏకపక్షంగా చేశారన్న అసంతృప్తితో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు స్థానిక నేతలు సహకరించలేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎంపి అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్లు వైసిపికి తీవ్రంగా నష్టపరిచాయి. బాపట్ల అభ్యర్థి నందిగం సురేష్‌ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండగా, ఆయనను కొనసాగించి సానుకూలత ఉన్న వి.బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయులను మార్చడం కూడా తీవ్ర నష్టం జరిగింది. గుంటూరు, విజయవాడ లోక్‌సభ స్థానాల్లో పట్టణ ప్రాంత ప్రభావం ఎక్కువగా ఉండటం, వైసిపి అభ్యర్థులపై అప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడం టిడిపికి సానుకూలంగా మారింది. మంగళగిరిలో గత ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు కొనసాగించిన టిడిపి అభ్యర్థి నారా లోకేష్‌ 91 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

➡️