కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల

Jan 5,2024 09:40 #Congress, #ys sharmila
  • వైఎస్సార్‌ టీపీ కాంగ్రెస్‌లో విలీనం
  • వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తానని వెల్లడి

ఢిల్లీ : వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్టీపీ) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన షర్మిల.. గురువారం ఉదయం తన భర్త అనిల్‌తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో ఆమె చేరారు. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్ష్యంలో షర్మిల వైఎస్సాఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. మణిపూర్‌ అల్లర్లలో 2000 చర్చిలను ద్వంసం చేసిన ఘటన తనను కలచివేసిందని తెలిపారు. కేంద్రంలో సెక్యులర్‌ పార్టీ అధికారంలో లేనందు వలనే ఈ ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద సెక్యులర్‌ పార్టీ కాంగ్రెస్సే అన్నారు. వైఎస్సాఆర్‌ జీవితమంతా కాంగ్రెస్‌ కోసం పనిచేశారన్నారు. తాను నాన్న వైఎస్సాఆర్‌ అడుగుజాడల్లో నడుస్తున్నానన్నారు. భారత్‌ జోడో యాత్రతో రాహుల్‌ గాంధీ తనతో పాటు దేశ ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపారని చెప్పారు. అందుకే తను కాంగ్రెస్‌లో చేరానని, తన పార్టీ వైఎస్సార్‌ టీపీని విలీనం చేశానని వివరించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేసిన షర్మిల.. కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్‌ టీపీ ఎన్నికలకు దూరంగా ఉందని చెప్పారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడం తన తండ్రి వైఎస్సార్‌ కల అని, ఆ కలను నెరవేర్చడానికి కృషి చేస్తానని షర్మిల వివరించారు.

➡️