అక్కినేని తర్వాత మెగాస్టార్‌కే దక్కిన పద్మవిభూషణ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ : తెలుగు సినీ ఇండిస్టీలో ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తర్వాత పద్మవిభూషణ్‌ అవార్డు మెగాస్టార్‌ చిరంజీవికే వరించింది. అక్కినేని నాగేశ్వరరావుకి 2011లో పద్మవిభూషణ్‌ అవార్డు దక్కింది. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు తాజాగా చిరంజీవికే ఈ అవార్డు దక్కింది. తెలుగు ఇండిస్టీలో పద్మవిభూషణ్‌ అవార్డు దక్కిన రెండవ హీరో చిరంజీవినే కావడం విశేషం.

కాగా, 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించింది. 1987లో స్వయం కృషి, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అలాగే శుభలేఖ, విజేత, ఆపద్బాంధవుడు, ముఠామేస్త్రీ, స్నేహం కోసం, ఇంద్ర, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులను దక్కించుకున్నారు. 2010లో ఆయనకు ఫిలింఫేర్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది. 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. అవార్డులన్నీ ఒకెత్తయితే.. 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం.

➡️