పండుగరోజూ దీక్షా శిభిరాల్లో నిరసన

Jan 17,2024 00:34

ప్రజాశక్తి – రేపల్లె
అంగన్‌వాడిల సమ్మెలో భాగంగా సంక్రాంతి సందర్భంగా దీక్షా శిబిరం వద్ద బండరాయికి పూజచేసి నిరసన వ్యక్తం తెలిపారు. అంగన్‌వాడి సిఐటియు సమ్మె శిబిరం వద్ద యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకుండా బండరాయిలాగే వ్యవహరిస్తుందని అన్నారు. అందరూ పండగ చేసుకుంటుంటే అంగన్‌వాడిలు రోడ్డున పడటం సిగ్గుచేట్టని, రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవడం వల్ల మహిళలు పోరాటాన్ని కొనసాగిస్తు రోడ్డు మీదకు నెట్టబడ్డారని అన్నారు. ప్రభుత్వ బెదిరింపులు వల్ల 17నుండి రాష్ట్ర కేంద్రంల్లో నిరవధిక నిరాహారదీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోరాటం ఉదృతం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ నాయకులు వై మేరీమణీ, డి జ్యోతి, లావణ్య, అరుణ, శ్రీలత, ప్రజ సంఘాల నాయకులు కె ఆశీర్వాదం, ఐ లీలకోటేశ్వరరావు, డి.జ్యోతి, లావణ్య, అరుణ,.శ్రీలత,నల్లినీ, కెవి లక్ష్మణరావు, కె రమేష్ పాల్గొన్నారు.


కొల్లూరు : అంగన్‌వాడీ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కనుమ రోజు కూడా సమ్మె నిర్వహించారు. సమ్మె శిబిరంలో భోజనాలు చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బొనిగల సుబ్బారావు, అంగన్‌వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.


యద్దనపూడి : అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన పండుగ రోజు కూడా కొనసాగించారు. దీక్షా శిబిరం వద్దకు వచ్చిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షడు బత్తుల హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుండా తాత్సరం చేయడం అన్యాయం అన్నారు. అంగన్‌వాడీలు తమ న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు పోరాటం కొనసాగించాలని అన్నారు.


అద్దంకి : అంగన్‌వాడి కార్యకర్తలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ సౌకర్యం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు కోరారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మెలో మాట్లాడారు. అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మె శిభిరంలోనే పిండి వంటలు చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి తిరుపతిరెడ్డి, గంగాధర్, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు జి శారద, కార్యకర్తలు పాల్గొన్నారు.


పర్చూరు : స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద చేస్తున్న అంగనవాడీల నిరవధిక సమ్మె 36వ రోజుకు చేరింది. ఐద్వ రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి మాట్లాడారు. సమ్మె పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తక్షణం సమ్మె పరిష్కారం చేయకపోతే ఆందోళన తీవ్రతం చేస్తామని అన్నారు. ప్రభుత్వం సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండి శంకరయ్య, సిఐటియు నాయకులు కె శ్రీనివాసరావు, బి చినదాసు పాల్గొన్నారు.


చీరాల : అంగన్‌వాడీల సమ్మెలో భాగంగా సంక్రాంతి సందర్భంగా కోలాటం, గాలిపటాలు ఎగరేసి నిరసన తెలిపారు. ఇప్పటిదాకా శాంతియుతంగా నిరసన తెలిపామని, తమ వేతన సమస్య పరిష్కారం చేయకపోతే రేపటి నుండి ఆందోళన ఉదృతం చేస్తామన్నారు. షోకాజు నోటీసులు వెనక్కి తీసుకోవాలని, ఎస్మా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సిఎం అయిన తర్వాత తమకు బాధలు తప్ప ఒరిగిందేమీ లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండిపొట్టు విడనాడి సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి పి రేఖ, సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు అన్నారు. కార్యక్రమంలో జి సుజీవన, సులోచన, బుల్లెమ్మాయి, పావని, అనిత పాల్గొన్నారు.


కారంచేడు : అంగన్‌వాడీల సమ్మెలో భాగంగా కనుమ పండుగ సందర్భంగా నిరసన కొనసాగించారు. తాము ఆందోళన ప్రారంభించి ఐదు వారాలు గడిచాయని అన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిష్కార మార్గం సూచించకపోగా ఆందోళనను పక్కదారి పట్టించే దిశగా, ఉద్యమాలను అవమానపరిచే విధంగా వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని అంగన్‌వాడీలు ఆరోపించారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన కొనసాగింది.


చెరుకుపల్లి : ప్రజలందరూ పండుగలు చేసుకుంటుంటే అంగన్‌వాడీలను రోడ్డునపడేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. మంగళవారం కనుమ రోజు కూడా తమ నిరసన కొనసాగించారు. స్థానిక తహశీల్దారు కార్యాలయ ఆవరణ, పోలీస్ స్టేషన్ ఎదురుగా ముగ్గులు వేసి తమ నిరసన తెలిపారు.


భట్టిప్రోలు : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక దీక్ష 36వ రోజు కొనసాగించారు. సంక్రాంతి పండుగను సైతం వదిలేసి తహశీల్దారు కార్యాలయం వద్ద దీక్ష శిబిరంలో నిరసన వ్యక్తం చేశారు. పండుగ సందర్భంగా అంగన్‌వాడిల దీక్షా శిబిరం వద్ద రైతు సంఘం నాయకులు వేములపల్లి వెంకటరామయ్య, కె రామస్వామి స్వీట్లు పంపిణీ చేశారు. అంగన్‌వాడిల డిమాండ్లు పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడి యూనియన్, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.

➡️