మహిళలూ … ఈ విటమిన్లు అందేలా చూసుకోండి!

Apr 1,2024 05:20 #Jeevana Stories

ఆరోగ్య పరిరక్షణలో సమతుల్య ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మహిళలు తమ డైట్‌లో కచ్చితంగా పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మహిళలు వయస్సు పెరిగే కొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. రుతుస్రావం నుంచి ప్రెగెన్సీ, డెలివరీ, మెనోపాజ్‌ వరకూ ఇలా శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. రక్తహీనత, నీరసం, అలసట, తలనొప్పి, రోగ నిరోధకశక్తి తగ్గటం, ప్రెగెన్సీ సంబంధిత రుగ్మతలు, రొమ్ము క్యాన్సర్‌, ఆర్థరైటిస్‌, ఓవేరియన్‌, పాలీసిస్టోసిస్‌ వంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. వయస్సు రీత్యా మహిళలకు శరీరంలో వచ్చే మార్పుల కారణంగా వారికి పలు రకాల విటమిన్లు అవసరమవుతాయి. మగవారితో పోలిస్తే మహిళలకు ప్రత్యేకంగా కొన్ని విటమిన్లు అవసరమవుతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్‌-ఎ : మహిళల ఆరోగ్యానికి విటమిన్‌ాఎ కీలకమైంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి ‘ఎ’ విటమిన్‌ తీసుకోవటం అత్యంత అవసరం. దీనికోసం టమోటా, క్యారెట్‌, బప్పాయి, గుమ్మడికాయ, పాలకూర, చేపలు, పాలు, గుడ్లు, పుచ్చకాయ వంటివి ప్రతిరోజూ తీసుకుంటుండాలి.
విటమిన్‌-సి : రోగ నిరోధక శక్తికి పెంపొందించుకోవటానికి తప్పకుండా రోజువారీ డైట్‌లో తీసుకోవాలి. ఇది రొమ్ము క్యాన్సర్‌ వంటి వ్యాధులను నిరోధిస్తుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యానికి ఇది ఎంతో అవసరం. ఇది సిట్రస్‌ ఫ్రూట్స్‌, బంగాళా దుంపలు, స్ట్రాబెర్రీస్‌, టమాటో, జామ, ఉసిరి వంటి వాటిలో లభిస్తుంది.
విటమిన్‌-డి : శరీరంలో కాల్షియం పెరుగుదలకు అవసరమైన ‘డి’ విటమిన్‌ మహిళల ఆరోగ్యానికి అత్యంత అవసరం. వయస్సుపైబడే కొద్దీ కీళ్ల అరుగుదల, కీళ్ల నొప్పులు వంటివి రాకుండా ఉండేందుకు విటమిన్‌-డి తీసుకోవటం అవసరం. ఇంటిపట్టునే ఉండే గృహిణుల్లో ఈ విటమిన్‌ ఎక్కువగా లోపిస్తుంది. అలాంటివాళ్లు రోజుకు కాసేపు ఎండలో ఉండటం అవసరం.
విటమిన్‌-బి3 : కణాల పనితీరు, పోషకాలను గ్రహించటంలో, నాడీ వ్యవస్థ పనితీరులో ‘బి3’ విటమిన్‌ కీలకం. ఇది ట్యూనా చేపలు, వేరుశెనగలు, పుట్టగొడుగులు, గోధుమలు, పాలు, గుడ్లు, బీన్స్‌ వంటి వాటిలో ఉంటుంది.
విటమిన్‌-బి6 : హార్మోన్ల ఉత్పత్తికి, మెదడు ఆరోగ్యానికి, రక్తహీనత వంటి సమస్యలను నివారించటానికి విటమిన్‌-బి6 అవసరం. దీనికోసం డ్రైఫ్రూట్స్‌, నట్స్‌, ఎగ్స్‌, ముడి ధాన్యాలు, బీన్స్‌, అరటిపండ్లు, మాంసం, ఓట్లు వంటివి తీసుకోవాలి.
విటమిన్‌-బి9 : ముఖ్యమైన విటమిన్లలో ‘బి9′(ఫోలిక్‌ యాసిడ్‌) కూడా ఒకటి. ఇది గర్భిణుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది ఆకుకూరలు, బీన్స్‌, పప్పు ధాన్యాలు, అరటిపండ్లు, చేపల్లో ఎక్కువగా ఉంటుంది.
విటమిన్‌-బి12 : మహిళల్లో రక్తహీనత తగ్గటానికి విటమిన్‌-బి 12 తీసుకోవడం అవసరం. ఇది రక్త కణాలు ఏర్పడటానికి, మెటబాలిజం రేటును పెంచటానికి ఉపయోగపడుతుంది. ఇది చేపలు, పాలు, గుడ్డు, మాంసం, పెరుగు వంటి పదార్థాల్లో అధికం.

➡️