టెకీలపై ఆగని వేటు

Jan 27,2024 10:01 #Business
  • తాజాగా మైక్రోసాఫ్ట్‌లో 1900 మంది
  • సేల్స్‌ఫోర్స్‌లో 700 ఉద్యోగుల తొలగింపు

న్యూఢిల్లీ : గతేడాదిలోని లక్షలాది టెకీల ఉద్వాసనలు మర్చిపోకముందే.. కొత్త ఏడాదిలోనూ టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపునకు వరుస కడుతున్నాయి. ఇప్పటికే గూగుల్‌, మెటా, అమెజాన్‌ సహా పలు టెక్‌ కంపెనీలు సిబ్బందిని ఇంటికి పంపించడానికి ప్రకటనలు చేయగా.. తాజాగా మైక్రోసాఫ్ట్‌ వేలాది మందిపై వేటు వేయడానికి సిద్దం అయ్యింది. అదే విధంగా సేల్స్‌ఫోర్స్‌ కూడా వందలాది మందిని రోడ్డున పడేసే పనిలో పడింది. ఆర్థిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యలు, పునర్‌ వ్యవస్థీకరణ ప్రణాళిక పేరుతో టెక్‌ కంపెనీలు సిబ్బందిని తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ డివిజన్‌లో 1900 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు ప్రకటించింది. యాక్టివిజన్‌ బ్లిజర్డ్‌, ఎక్స్‌బాక్స్‌ సహా గేమింగ్‌ డివిజన్‌లో తొలగింపులు ఉంటాయని వెల్లడించింది. నూతన ప్రాజెక్టులపై దృష్టి సారించడం, కార్యకలాపాల క్రమబద్ధీకరణతో ఈ సంక్లిష్ట బాధాకర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. ఈ ప్రక్రియను గేమింగ్‌ నాయకత్వ బృందంతో పాటు తాను సాఫీగా సాగేలా కృషి చేస్తామని మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ సిఇఒ ఫిల్‌ స్పెన్సర్‌ ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో స్పష్టం చేశారు. సేల్స్‌ఫోర్స్‌లో 700 మందిపై వేటు..క్లౌడ్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సేల్స్‌ఫోర్స్‌ 700 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆ సంస్థ గత ఏడాదిలోనూ పది శాతం సిబ్బందిపై వేటు వేయడంతో దాదాపు 8000 మంది రోడ్డున పడ్డారు. టెక్‌ పరిశ్రమ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో ఇతర టెక్‌ కంపెనీల తరహాలోనే దీర్ఘకాలం నిలదొక్కుకునే వ్యూహాంతో సేల్స్‌ఫోర్స్‌ సైతం సిబ్బంది సంఖ్యకు కోత పెట్టింది. మరోవైపు జర్మనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం శాప్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎఐపై దృష్టి పెంచడంతో 8000 ఉద్యోగుల భవితవ్యంపై ఆందోళన నెలకొంది. శాప్‌లో ప్రపంచవ్యాప్తంగా 1,08,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఎఐపై దృష్టి పెట్టడంతో దాదాపు 7 శాతం మంది ఉద్యోగులపై ప్రభావం పడనుందని సమాచారం. అలాగే ఆన్‌లైన్‌ రిటైలర్‌ ఈబే దాదాపు 1,000 మంది ఉద్యోగుల తొలగింపులను కూడా ప్రకటించింది. లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ రిపోర్టుల ప్రకారం.. 2024లో ఇప్పటి వరకు 85 టెక్నాలజీ కంపెనీలు 23,770 మంది ఉద్యోగులను తొలగించాయి.

➡️