బెడిసికొట్టిన సోనీ-జీ ఒప్పందం.. రూ.80వేల కోట్ల డీల్‌ రద్దు

Jan 23,2024 08:11 #Business, #sony, #zee

న్యూఢిల్లీ : జపనీస్‌ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌, సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా మధ్య కుదురిన ఒప్పందం అనుహ్యాంగా బెడిసికొట్టింది. దీంతో 10 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.83వేల కోట్ల) ఒప్పందం రద్దయినట్లయ్యింది. 2021 డిసెంబర్‌ 22న విలీన ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు చేశాయి. కొత్తగా ఏర్పాటయ్యే సంయుక్త కంపెనీలో సోనీ పరోక్షంగా 50.86 శాతం వాటా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 3.99, మిగతా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వాటాదారులకు 45.15 శాతం చొప్పున వాటాలకు అంగీకారం కుదురింది. ఒప్పంద అమలు గడువు 2023 డిసెంబర్‌ 21తో ముగిసినప్పటికీ.. తదుపరి 2024 జనవరి 21 వరకూ పొడిగించారు. గడువు పొడిగించినప్పటికీ రెండు కంపెనీలు తమ విభేదాలను పరిష్కరించుకోవడంలో విఫలమయ్యాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒ పునీత్‌ గోయెంకాతో పాటు సంస్థ ప్రమోటర్లపై కేసులు, రెగ్యులేటరీ సంస్థల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విలీన ఒప్పందం నిలిచిపోయినట్లు రిపోర్టులు వస్తున్నాయి. గోయెంకా నాయకత్వంపై సోనీ యాజమాన్యం సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే విలీన ఒప్పందం నుంచి సోనీ పిక్చర్స్‌ నెట్‌ వర్క్స్‌ ఇండియా వైదొలిగినట్లు ప్రకటించిందని తెలుస్తుంది. దీనిపై సోనీకి న్యాయపరమైన నోటీసులు ఇస్తామని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేర్కొంది.

➡️