రికార్డు స్థాయికి వర్జీనియా ధర

Apr 27,2024 10:33 #prices, #record highs, #Virginia

ప్రజాశక్తి – గోపాలపురం (తూర్పు గోదావరి) : మునుపెన్నడూ లేని విధంగా వర్జీనియా పొగాకుకు రికార్డు స్థాయిలో ధర పలికింది. దేవరపల్లి కొనుగోలు కేంద్రంలో కేజీ రూ.307కు అమ్ముడైంది. దీంతో పొగాకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోపాలపురం టొబాకో బోర్డు రైతులు వేలం కేంద్రానికి 1210 బేళ్లు అమ్మకానికి పెట్టుకోగా 1044 బేళ్ల కొనుగోలు జరిగింది. అత్యధిక రేటు రూ.324 కాగా అత్యల్ప ధర రూ.235 పలికింది. సరాసరిన రూ.303.94 గిట్టుబాటు ధర లభించింది. ఈ ఏడాది కొనుగోళ్లు ప్రారంభంలో కేజీ పొగాకు రూ.240 ధర పలికింది. దీంతో రైతులు నిరాశ చెందారు. వేలంకేంద్రంకు బేళ్లను సైతం రైతులు తీసుకొచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. ఈ ఏడాది తుపాను కారణంగా వర్జీనియా పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో రైతులు దెబ్బతిన్న పంట స్థానంలో రెండోసారి పంటవేయాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా పొగాకు పంట ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో స్థానికంగా ఉన్న విదేశీ దేశీయ పొగాకుకు డిమాండ్‌ పెరిగింది. అందుకు అనుగుణంగా ఎగుమతుల ఆర్డర్లు కూడా రావడంతో వర్జీనియా ధర రికార్డు స్థాయికి చేరింది. దేవరపల్లి వేలం కేంద్రానికి 1033 బేళ్లు అమ్మకానికి రాగా వాటిలో 837 కొనుగోల చేసినట్లు తెలిపారు .అత్యధిక ధర రూ.327 పలకగా అత్యల్ప ధర రూ.238 చొప్పున కొనుగోలు చేశారు. సరాసరి రూ.301.82 ధర పలికింది.15 కంపెనీలు వేలంలో పాల్గొన్నట్లు మేనేజర్‌ ఎం.ఆదిశేషయ్య, ఆక్షన్‌ సూపరింటెండెంట్‌ అమూల్‌ డి,శ్యామ్‌ తెలిపారు. ఐటిసి బైరు, ఆదర్శ్‌, జిపిఐ, తిరపతి రెడ్డి, పోలిశెట్టి కంపెనీ శ్రీనివాసరావు, ముస్తఫా కంపెనీ కొడమంచిలి శ్రీనివాసరావు, ఎలైట్‌ సురేంద్ర రాజు, డెక్కన్‌, నాగరాజు, అలెన్స్‌ సుబ్బారావు, బొమ్మిడాల రెహమాన్‌ పాల్గొన్నారు.

➡️