అంగన్‌వాడీలకు మద్దతుగా 20న రాస్తారోకోలు

Jan 19,2024 00:43

మాట్లాడుతున్న నేతాజి
ప్రజాశక్తి-గుంటూరు : అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు మద్దతుగా 20వ తేదీ జిల్లా, మండల కేంద్రాలలో రాస్తారోకోలు నిర్వహిస్తామని కార్మిక, ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు. గురువారం స్థానిక కొత్తపేట, మల్లయ్యలింగం భవన్‌లో వివిధ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు సమాశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 38 రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో అంగన్‌వాడీతో ప్రభుత్వంతో 6 దఫాలుగా చర్చలు జరిపి, వేతనం విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వని నేపథ్యంలో విజయవాడలో అంగన్వాడీ రాష్ట్ర నాయకులు ఈనెల 17వ తేదీ నుండి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. వారికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకోలకు రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయని చెప్పారు. సమావేశంలో ఎఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.రాధాకృష్ణమూర్తి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ, ఎఐటియుసి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.అరుణ్‌ కుమార్‌, ఎం.హనుమంతరావు, ఐఎఫ్‌టియు కార్యదర్శి కృష్ణ, ఎఐటియుసి నగర కార్యదర్శి అంజిబాబు, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు పాల్గొన్నారు.

➡️