అంగన్‌వాడీల సమ్మెకు ప్రజా మద్దతు

అంగన్‌వాడీల సమ్మెకు ప్రజా మద్దతు

కాకినాడ రూరల్‌ పది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్స్‌ కోసం సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలకు ప్రజా మద్దతు కూడగట్టాలని ప్రజా సంఘాల రౌండ్‌ టేబుల్‌ నిర్ణయించింది. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వీధిలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యాన రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పది రోజులుగా లక్ష మందికి పైగా అంగన్‌వాడీలు, హెల్పర్లు నిరవధిక సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని, ఈ సమ్మె అంగన్‌వాడీల కోసం మాత్రమే కాదని, పిల్లలు, గర్భిణులకు సంబంధించిన డిమాండ్స్‌ కూడా ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి తక్షణం వారి డిమాండ్స్‌ను ఆమోదించి సమ్మెను విరమింపచేయాలని కోరారు. లేదంటే లబ్ధిదారులను కూడగట్టి ప్రత్యక్ష పోరాటంలోకి దిగుతామని హెచ్చరించారు. సామాజిక కార్యకర్త పెద్దింశెట్టి రామకష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో టిఎన్‌టియుసి నాయకులు జి.సాయిబాబా, బాబ్జీ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు వి.చంద్రరావు, ఎల్‌ఐసి ఏజెంట్స్‌ నాయకుడు అంబటి రామకృష్ణ, పిఎన్‌ఎం నాయకుడు జెఎస్‌కె.శ్రీనివాసరావు, సిఐటియు రూరల్‌ కన్వీనర్‌ టి.రాజా, ఎంవి.రమణ, ప్రయివేట్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ నాయకలు టి.సుబ్బారావు, చేతి వృత్తుల సంఘాల కన్వీనర్‌ సిహెచ్‌.అజరు కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పావని, అంగన్‌వాడీ నాయకులు చామంతి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

➡️