అంగన్‌వాడీల సమ్మె ఉధృతం

Dec 16,2023 20:22

ప్రజాశక్తి-గజపతినగరం, విజయనగరం టౌన్‌  :  సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శనివారం ఐదో రోజుకు చేరుకుంది. ప్రభుత్వంతో చర్చలు విఫలమవ్వడంతో సమ్మె మరింత ఉదృతంగా మారుతోంది. మరోవైపు కేంద్రాల తాళాలు పగులగొట్టే వాటిని నడిపేందుకు చేస్తున్న అధికారుల చర్యలను అంగన్‌వాడీలంతా నిరసిస్తున్నారు. తాళాలు బద్దలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మెలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్సు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు బి పైడిరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జరిపిన చర్చల్లో ఆర్ధిక పరమైన డిమాండ్‌ లు పరిష్కారానికి చొరవ చూపకుండా చర్చలు ముగించడం సరికాదన్నారు. తాము ఏదీ అదనంగా కోరడం లేదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చెయ్యాలని కోరుతున్నామన్నారు. సమస్యలు పరిష్కారం చేయకుండా కేంద్రాలను బలవంతంగా తాళాలు పగలు కొట్టించడం ప్రభుత్వానికి తగదన్నారు. సచివాలయం ఉద్యోగులు కూడా తోటి ఉద్యోగులేనని, చాలా జిల్లాలో సచివాలయ ఉద్యోగులు కేంద్రాలను తెరిచేందుకు ముందుకు రాలేదని జిల్లాలో ఉన్న సచివాలయం ఉద్యోగులు కూడా తమకు సహకరించాలని కోరారు. బలవంతంగా కేంద్రాలు తెరిపించడం, అంగన్‌వాడీలను బెదిరించడం వంటి చర్యలు మానుకోవాలని, బెదిరింపులకు భయపడేది లేదని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం మా ఆర్ధిక పరమైన డిమాండ్‌ లు పరిష్కారం చేసే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. సమ్మె శిబిరాన్ని ఎపిటిఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు బంకురు జోగినాయుడు సందర్శించి మద్దతు తెలిపారు.గజపతినగరంలో అంగన్‌వాడీలంతా సమ్మె కొనసాగించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంగన్వాడీ సమస్యలతో పాటు కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటిపైన అనేక సందర్భాల్లో పోరాటం చేశారని, మా పోరాటానికి మద్దతుగా ఉన్న ఒక గొంతు మూగ పోయిందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మి అన్నారు. అనంతరం నోటికి నల్ల రెబ్బలు కట్టుకొని నిరసన తెలిపారు. ఒకవైపు మా సెంటర్ల తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బందితో, వాలంటీర్లతో పనిచేయించడం సరైనది కాదన్నారు. సచివాలయ సిబ్బంది తమ సమ్మెకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు ఎం.సుభాషిని, పి జ్యోతి, నాగమణి, వాణి, నారాయణమ్మ, రవణమ్మ, సుజాత పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️