అక్రమ రవాణాపై దృష్టి పెట్టండి

Feb 29,2024 21:39

 ప్రజాశక్తి-విజయనగరం  : ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపరిచే చర్యలను అరికట్టాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. పెద్ద ఎత్తున జరిగే నగదు బదిలీ, వివిధ రకాల వస్తువులు, వస్త్రాల అక్రమ రవాణాపై నిఘా పెట్టాలని సూచించారు. జిల్లా స్థాయి విజిలెన్స్‌, ఇఎస్‌ఎంఎస్‌ (ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) నోడల్‌ ఆఫీసర్ల సమావేశాన్ని కలెక్టర్‌ తన ఛాంబర్‌లో గురువారం నిర్వహించారు. ముందుగా ఆయా నోడల్‌ అధికారుల విధులను, శాఖాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికల్లో అన్ని రకాల ప్రలోభాలను అరికట్టాలని ఆదేశించారు. నగదు, మద్యం, వివిధ రకాల పరికరాలు, వస్తువులు, వస్త్రాలు, ఆభరణాల అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ వచ్చేవరకు ఆగకుండా ఇప్పటినుంచే ఆయా శాఖలు దృష్టి సారించాలని సూచించారు. వినూత్న పద్దతుల్లో అక్రమంగా రవాణా చేసే అవకాశం ఉందని, వాటిని కూడా ముందుగానే పసిగట్టి నియంత్రించాలని అన్నారు. బ్యాంకుల్లో రూ.2లక్షల దాటిన నగదు లావాదేవీలపై ఖాతాదారులు వివరాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఎటిఎంలకు, బ్యాంకులకు నగదును తరలించే టప్పుడు, ఆ నగదుకు ప్రత్యేక క్యుఆర్‌ కోడ్‌ను కేటాయించే కొత్త విధానం త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఓటర్లను ప్రలోభపెట్టే అన్ని రకాల చర్యలను పూర్తిగా నిరోధించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సుమారు రూ.777 కోట్ల విలువైన నగదు, మద్యం, వస్తువులను సీజ్‌ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే రాజస్తాన్‌ ఎన్నికల్లో సుమారు రూ.700 కోట్లు, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో రూ.300 కోట్ల విలువైన నగదు, మద్యం, వస్తువులను సీజ్‌ చేశారని తెలిపారు. వివిధ శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో వ్యవహరిస్తూ, కట్టుధిట్టంగా మద్యం, వస్తువుల అక్రమ రవాణా, నగదు బదిలీలను పూర్తిగా నిరోధించాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, నోడల్‌ ఆఫీసర్లు ఎఎస్‌పి అస్మా పర్హీన్‌, ఆదాయ పన్నుల శాఖ అధికారి ఎన్‌.రేణుకాదేవి, ఎక్సైజ్‌ సూపరింటిండెంట్‌ బి.శ్రీనాధుడు, అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటిండెంట్‌డివిజి రాజు, సిజిఎస్‌టి సూపరింటెండెంట్‌ ఎఎస్‌ఎల్‌ శర్మ, ఎస్‌జిఎస్‌టి సూపరింటెండెంట్‌ పిబి వల్లి, ఎఫ్‌ఆర్‌ఒ బి.అప్పలరాజు, ఆర్‌పిఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ అఖిలేష్‌ కుమార్‌, ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️