అడ్మిన్‌ బిల్డింగ్‌ ముట్టడిని జయప్రదం చేయండి

 ప్రజాశక్తి-ఉక్కునగరం : ఉక్కునగరంలో మంగళవారం జరిగే అడ్మిన్‌ బిల్డింగ్‌ ముట్టడిని జయప్రదం చేయాలని స్టీల్‌ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ పిలుపునిచ్చారు. ప్లాంట్‌లోని సిఎంఎస్‌ కేథరిన్‌ పాయింట్‌ వద్ద స్టీల్‌ సిఐటియు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయోధ్యరామ్‌ మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం మొండిగా జిందాల్‌తో ఒప్పందం చేస్తోందని, దీనిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌తో అడ్మిన్‌ బిల్డింగ్‌ ముట్టడి చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిరసన యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఒక గట్టి గుణపాఠం కావాలన్నారు. యాజమాన్యం తమ వైఖరిని పునరాలోచించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. స్టీల్‌ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ, కార్మికుల వేతన ఒప్పందంలో యాజమాన్య వైఖరి దుర్మార్గంగా ఉందన్నారు. పెరుగుతున్న ధరలతో, నూతన కార్మికులు చాలీచాలని జీతాలతో ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. యాజమాన్యం వైఖరిని మార్చుకుంటూ నూతన వేతనాలు అమలుకై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. స్టీల్‌ సిఐటియు అధ్యక్షులు వైటి.దాస్‌ మాట్లాడుతూ, ఉక్కు ఉద్యమానికి సంఘీభావంగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఈనెల 27వ తేదీకి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నారని, దానిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్టీల్‌ సిఐటియు కార్యకర్తలు పి.శ్రీనివాసరాజు, కె.గంగాధర్‌, కెవి.సత్యనారాయణ, బిఎన్‌.మధుసూదన్‌, విడివి పూర్ణచంద్రరావు, సూర్యనారాయణ, రమణమూర్తి, ముత్యాలనాయుడు, లోకేష్‌, వివిధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

 

➡️