అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

ప్రజాశక్తి-గాలివీడు అధైర్య పడవద్దు, అన్నివేళలా అండగా మీకు మేమున్నామని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు బుధవారం మండలంలో ఆమెకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున చేరుకొని స్వాగతం పలికారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఎగవ గొట్టివీడు గ్రామంలో నాగన్నగుట్ట పాలెంకు చెందిన సర్పంచ్‌ ప్రభాకర్‌ నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అరెస్టుని జీర్ణించుకోలేక గుండెపొటుతో ప్రభాకర్‌నాయుడు సతీమణి రెడ్డమ్మ మరణించారు. రెడ్డమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ అన్యాయాన్ని ఎదుర్కొని నిజాన్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనపై విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు ప్రజలు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. కక్ష సాధింపు చర్యలతోనే అనేక మందిని అక్రమ అరెస్టులకు గురిచేసి మానసిక క్షోభకు గురిచేశారన్నారు. రానున్న రెండు నెలల్లో ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ధైర్యంగా నిలబడి నిర్భయంగా ఓటు వేసి వేయించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సిఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. తాను కూడా రాయలసీమ పౌరుషం కలిగిన బిడ్డనని ఎటువంటి భయాలకు భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. వైసిపి అరాచకాలను ప్రజలలోకి తీసుకువెళ్లి తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు మీ అందరి కషితో ముందుకు వెళతానని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు మేలు చేసే వ్యక్తి గాని కీడు చేసే వ్యక్తి కాదని, జగన్మోహన్‌రెడ్డి కక్ష సాధింపుతోనే అక్రమ అరెస్టులు చేసినప్పటికీ తప్పు చేసినట్లు నిరూపించలేకపోయారని విమర్శించారు. రాయచోటి : స్థానిక రింగ్‌ రోడ్డులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, టిడిపి పార్లమెంట్‌ అభ్యర్థి సుగువాసి బాలసుబ్రమణ్యం, రాజంపేట టిడిపి జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్‌ రాజు, రాయచోటి అసెంబ్లీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని రాజుల కాలనీలో మృతి చెందిన టిడిపి కార్యకర్త ఎం.రవీంద్రరాజు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. పీలేరు: పీలేరులో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కాన్వారులోని ఐదవ వాహనాన్ని అడ్డుకున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడుకు వెళుతున్న భువనేశ్వరికి పీలేరులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె అందరికీ అభి వాదం చేస్తూ, ఆప్యాయంగా పలకరించారు. అనంతరం పీలేరు నుంచి గాలివీడుకు బయలుదేరిన కాన్వారులో భువనేశ్వరి పిఎ ప్రయాణం చేస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, టిడిపి శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సుమారు అరగంట మేరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు మీడియా వాహనాన్ని సైతం అడ్డుకోవడంతో మీడియా ప్రతినిధులు, ఇతర వాహనదారులు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. భువనేశ్వరికి స్వాగతం పలికిన వారిలో నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డితో పాటు తిమ్మాపురం రఘునాథరెడ్డి, వారణాసి శ్రీకాంత్‌రెడ్డి, కోటపల్లి బాబురెడ్డి పాల్గొన్నారు. కలకడ: భువనేశ్వరికి మండల కేంద్రమైన కల కడలో ఘన స్వాగతం పలికారు. తెలుగు తమ్ముళ్లు బాణసంచా పేలిచే ఆమెకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. స్వాగతం పలికిన వారిలో కిషోర్‌ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ అనురాధ, మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్‌ నాయుడు, సర్పంచులు గుర్రం శివ, వెంకటరమణ, విశ్వనాథ నాయుడు, లక్ష్మి ప్రసన్న కుమారి, మండల నాయకులు మద్దిపట్ల సూర్య ప్రకాష్‌ నాయుడు, మల్లారపు రవి ప్రకాష్‌ నాయుడు, బరకం శ్రీనివాసులురెడ్డి, మాజీ జడ్‌పిటిసి తిరుపతి నాయుడు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️