‘అనంతసాగరం’లో విజయీభవ యాత్ర

Mar 20,2024 22:07

ఫొటో : సమస్యలు తెలుసుకుంటున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
‘అనంతసాగరం’లో విజయీభవ యాత్ర
ప్రజాశక్తి-అనంతసాగరం : మండలంలోని వడ్డీపాళెం, కొత్తపల్లి, కాకూరువారిపల్లి, వెంగమనాయుడుపల్లి, కచిరిదేవరాయపల్లి గ్రామాల్లో బుధవారం ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి విజయీభవ యాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాలలో ఎంఎల్‌ఎ మేకపాటికి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇస్తూ పూలు చల్లుతూ ఆప్యాయంగా ఎంఎల్‌ఎకు స్వాగతం పలికారు. ప్రజలతో ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమాభివృద్ధిలో రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేకూర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి గడపలోనూ సంపూర్ణ ఆరోగ్య మందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకోవాలనే సమున్నత లక్ష్యంతో ముందుకు సాగారని తెలిపారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ మిగిలిన రాష్ట్రాల వారు అమలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని, రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మాత్రం దుష్ప్రాచారాలు చేస్తూ సంక్షేమ పథకాలతో ఆర్థికంగా నష్టపోతారని చెప్పారని, అయితే ప్రజల్లోకి వారు వచ్చిన తరువాత జగనన్న పథకాల గురించి పూర్తిగా తెలుసుకుని తమ తొలి మేనిఫెస్టో అంటూ ఇవే పథకాలను ప్రజల ముందుకు తీసుకొచ్చారని, ఇది ప్రజలంతా గమనించాలన్నారు. ఐదేళ్లలో జగనన్న సంక్షేమాన్ని అందుకున్న ప్రతిఒక్కరూ ప్రజలకు చేసిన మేలు, సంక్షేమాన్ని అందరికీ వివరించాల్సిన బాధ్యత తీసుకోవాలని, మళ్లీ మనందరి సంక్షేమ ప్రభుత్వం వచ్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజలకు చేసిన మంచిని వివరించి ఓట్లు అడిగే ధైర్యం ఒక్క జగనన్నకే ఉందని, హామీలన్నీ మరచి ప్రజలను ఓటు బ్యాంకుగా మాత్రమే భావించే ఇవేమి అర్థం కావని, రానున్న 2024 ఎన్నికల్లో మళ్లీ వారికి బుద్ధి చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గ్రామాలలో పరిధిలో డిబిటి, నాన్‌ డిబిటి పథకాల కింద 4456మంది లబ్ధిదారులకు రూ.19.87 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. విద్యాభివృద్ధి కోసం 8వ తరగతి విద్యార్థులకు 47మంది రూ.15.51లక్షల విలువైన ట్యాబ్‌లు అందజేశారని తెలిపారు. జగనన్న లే అవుట్‌ కింద రూ.91.80లక్షలు సొంత స్థలాలు కలిగిన వారికి రూ.21.60 లక్షలు అందజేశారన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా రూ.10 లక్షలు అభివృద్ధి పనులకు అందజేయడం జరిగిందన్నారు. రెవెన్యూ సంస్కరణలను కలెక్టర్‌తో జరిపిన ప్రత్యేక సమీక్షలతో 676మంది రైతులకు సంబంధించిన 565 ఎకరాల్లో భూ సమస్యలకు పరిష్కారం చూపినట్లు వివరించారు. గత ప్రభుత్వాల పాలనలో నియోజకవర్గంలో ఇంతటి అభివృద్ధి, సంక్షేమం ఏ మేరకు అందజేశారో.. ప్రజలకు వివరించి ఓట్లు అడిగేందుకు రావాలని, ప్రజలకు కూడా ప్రశ్నలడిగేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలందరీ ఆశీర్వాదంతో తమ కుటుంబం ఆత్మకూరు నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి కోసం సిద్ధంగా ఉన్నామని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే జగనన్న సారథ్యంలో ప్రజలందరూ మెచ్చేలా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి సంపూర్ణమ్మ, ఎంపిటిసిలు, గ్రామ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

➡️