అన్ని పార్టీలూ మహిళా మేనిఫెస్టోను ప్రకటించాలిసభలో

Mar 9,2024 23:17

మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి
ప్రజాశక్తి – దుగ్గిరాల :
వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మహిళా మేనిఫెస్టోను ప్రవేశపెట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి డిమాండ్‌ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని మంచికలపూడిలో ఐద్వా బహిరంగ సభ శనివారం నిర్వహించారు. సభకు ఐద్వా మండల అధ్యక్షులు డి.స్వర్ణగౌరీ అధ్యక్షత వహించారు. రమాదేవి మాట్లాడుతూ గ్యాస్‌, నిత్యావసర ధరలు వీపరీతంగా పెరుగుతున్నాయని, ఈ భారం మహిళలపై తీవ్రంగా ఉందని అన్నారు. నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, ఉపాధి హామీని హక్కుగా కల్పించాలని, తద్వారా మహిళల ఆర్థిక పరస్థితులు మెరుగవుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఏడాదిలో 200 రోజులు ఉపాధి హామీ పని దినాలు కల్పించాలన్నారు. పట్టణాల్లోనూ ఉపాధి హామీ పనులు కల్పించేందుకు ఎంప్లాయిమెంట్‌ ఎక్ఛేంజీలు పెట్టాలని, ఈ అంశాలను మహిళా మేనిఫెస్టోల్లో పొందుపర్చాలని కోరారు. కోటి 4 లక్షల మంది ఉన్న డ్వాక్రా మహిళలకు చెందిన రూ.18 కోట్ల అంతర్గత రుణాలివ్వాలని, వడ్డీ మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. 90 రోజుల్లో అత్యాచార, లైంగిక దాడి కేసులను పరిష్కరించాలన్నారు. కుటుంబాలను, జీవితాలను చిత్తు చేస్తున్న మద్యం, మత్తు పదార్థాల విక్రయాలను నిలిపేయాలని, ఈ మేరకు అన్ని పార్టీలు స్పష్టమైన హామీలివ్వాలని కోరారు. వీటిని అమ్ముతున్న, ప్రోత్సహిత్తున వారికి కఠిన శిక్షలు విధించాలన్నారు. మత్తు పదర్థాలు నిషేధిస్తామని ప్రభుత్వం. సనాతన ధర్మం పేరుతో మహిళలను అణగదొక్కడానికి బిజెపి చూస్తోందని, ఆ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. తొలుత చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చి సభికులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు కె.పద్మ, సర్పంచ్‌ వై.చంద్ర దుర్గాభవాని, ఐద్వా గ్రామ అధ్యక్షులు వై.జయ, పాఠశాల చైర్మన్‌ వి.హైమావతి, ఉపాధ్యాయులు షేక్‌ కరీముల్లా, స్థానిక మహిళలు నాగేశ్వరమ్మ, పుష్పలత పాల్గొన్నారు.

➡️