అన్ని వీధుల్లోనూ కుళాయిలు ఏర్పాటు చేయాలి

Feb 5,2024 21:14

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌: మండలంలోని నర్సిపురంలో అన్ని వీధులలోనూ ఇంటింటికి కులాయిలు ఏర్పాటు చేయాలని కోరుతూ పలు వీధులకు చెందిన ప్రజలు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బోనాల విజయచంద్ర, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, జనసేన నాయకులు ఆగూరు మని ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో కలెక్టర్‌కు వినతి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా అన్ని వీధులలో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రధాన వీధికి అనుకొని ఉన్న మర్రి వీధి, ఆగూరు వీధి, కుమ్మరి వీధి, చాకలి వీధిలలో కుళాయిలు ఏర్పాటు చేయలేదన్నారు. గ్రామంలో అందరిలాగే పంచాయతీకి తామూ పన్నులు చెల్లిస్తున్నామని ఈ నాలుగు వీధులలో సుమారు 500 కుటుంబాలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాయని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు బోను చంద్రమౌళి, గురజాన చంద్రమౌళి, గొట్టాపు వెంకటరమణ, పోల సత్యనారాయణ, బర్నాల సీతారాం పాల్గొన్నారు.ఉపాధి పనులతో గ్రామాలను అభివృద్ధి చేస్తాంఉపాధి హామీ పనులతో గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత టిడిపిదేనని, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో పల్లెలను అభివృద్ధి చేస్తామని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజయచంద్ర, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అన్నారు. సోమవారం మండలంలోని తాళ్ల బురిడీ గ్రామంలో పర్యటించిన వారు ఉపాధి హామీ వేతన దారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి హామీ పథకాన్ని తుంగలోకి తొక్కిందన్నారు. తమ హయామంలో చెరువు పనులే కాకుండా రహదారుల నిర్మాణాలు, పొలాల్లో నీటి కుంటల నిర్మాణాలు, పంట ఉత్పత్తుల కోసం కల్లాలు నిర్మించామని గుర్తు చేశారు. అభివృద్ధికి మారుపేరైన చంద్రబాబును గెలిపించి పల్లెల తలరాతలను మార్చుకుందామన్నారు.

➡️