అప్పుడు పొగిడి.. ఇప్పుడు విస్మరించి..

Mar 27,2024 22:56

పల్నాడు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారికి వినతి పత్రం ఇస్తున్న యూనియన్‌ నాయకులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
కోవిడ్‌ సమయంలో ఆశాలు ప్రాణాలకు తెగించి చేసిన సేవలు మరువలేనివని పొగడ్తలతో ముంచెత్తిన ప్రభుత్వం ఇప్పుడు వారిని చేస్తోందని, అన్ని పనులకూ ఆశా కార్యకర్తలే ముందుంటున్నా వారి సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శివకుమారి అన్నారు. ఆశాలకు పనిభారం తగ్గించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.రవి యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రం అందజేశారు. శివకుమారి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను రెగ్యులరైజేషన్‌ చేసి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తిస్తామన్న ప్రభుత్వం ఆ పని చేయకపోగా పని భారాన్ని పెంచిందన్నారు. పనికి తగ్గ వేతనం ఇప్పడం లేదని చెప్పారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సక్రమంగా పని చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరమ్మతులకు గురైతే ఫోన్లను ఆశాలే రిపేరు చేసుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఆశా వర్కర్ల సమాచారం నోటు పుస్తకంలో రిజిస్టర్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. జిల్లాలో కొన్నిచోట్ల సబ్‌ సెంటర్లు, హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్‌లలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డ్యూటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, ఆశా వర్కర్లను ఫీల్డ్‌ వర్క్‌ పరిమితం చేయాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో ఆశా వర్కర్ల చేత వ్యాక్సిన్‌ బాక్స్‌లు తెప్పిస్తున్నారని, పై అధికారులు చేయాల్సిన ఆన్లైన్‌ పని కూడా ఆశాలతోనే నిర్బంధంగా చేయిస్తున్నారని, వీటిని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. పని భారం, ఒత్తి పెరుగడంతో పలువురు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు ఎం.ధనలక్ష్మి, ఎం.భూలక్ష్మి తదితరులు ఉన్నారు.

➡️